Begin typing your search above and press return to search.

పాక్ కు భారీ షాక్... కీలక "ఉగ్ర"నాగు హతం!

ఈ నేపథ్యంలో పఠాన్‌ కోట్‌ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 9:51 AM GMT
పాక్  కు భారీ షాక్... కీలక ఉగ్రనాగు హతం!
X

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది! అది దాని నైజం! ఉగ్రవాది అనేవాడు ఈ రోజు కాస్త సమ్మగా మాట్లాడినా.. వాడి మస్తిష్కంలో నాటబడిన బీజాల ఫలితం ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి జ్ఞానోదయాలు ఎన్ని జరిగినా పాకిస్థాన్ కు జ్ఞానం రాదనే మాట భారత్ తో పాటు చాలా ప్రపంచం దేశాలు చెబుతుంటాయి. ఈ క్రమంలో మరోసారి పాక్ కు జ్ఞానం కలిగించే సంఘటన జరిగింది. అయితే పాక్ ఇప్పుడైనా నేర్చుకుంటుందా.. అంటే... 100 శాతం డౌట్ కన్ ఫాం!

2016 జనవరి 2వ తేదీన పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 17 గంటల పాటు జరిగిన ఈ దాడిలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదిగా నమోదైంది. ఇదే సమయంలో... ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పఠాన్‌ కోట్‌ లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోరంలో మరో అధికారి మరణించారు.

ఈ ఘటనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది భారత్. ఇదే సమయంలో ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను భారత భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అయితే... ఈ ఘటనకు సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ అని అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇతడు పక్కనున పాకిస్థాన్ నుంచే ఈ దాడికి పథకం రచించినట్లు గురించారు! అతడే సుమారు ఐదుగురు ముష్కరులను కోఆర్డినేట్‌ చేసి పఠాన్‌ కోట్‌ కు పంపినట్లు దర్యాప్తు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలో ఎన్.ఐ.ఏ. అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో పఠాన్‌ కోట్‌ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడని తెలుస్తుంది. పాకిస్థాన్‌ లోని సియాల్‌ కోట్‌ లో షాహిద్ లతీఫ్ ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాగా... ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కు ఈ షాహిద్ లతిఫ్‌ లాంచింగ్‌ కమాండర్‌ గా వ్యవహరిస్తున్నాడు.

కాగా... షాహిద్ లతీఫ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో 1994 నవంబరులో జమ్మూకశ్మీర్‌ లో అరెస్టయిన సంగతి తెలిసిందే. సుమారు 16 ఏళ్ల పాటు భారత జైల్లో శిక్ష అనుభవించిన అతడిని 2010లో వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ కు అప్పగించారు.

ఆ సంగతి అలా ఉంటే... పాక్ కు వెన్నెముక గా భారత్ అభివర్ణించే ఉగ్రమూకలు ఒక్కొక్కరుగా మరణిస్తుండటం ఇప్పుడు ఆ దేశాన్ని కలవరపెడుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా గత నెల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇది తాజా షాక్ లలో పాక్ కు మొదటిది.

అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో అల్‌ బదర్‌ ముజాహిదీన్‌ మాజీ కమాండర్‌ సయ్యద్‌ ఖాలిద్‌ రజాను కరాచీలో గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. వెంటనే ఒక నెల వ్యవధిలో.. అంటే ఈ ఏడాది మార్చిలో రావల్పిండిలో నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌ బషీర్‌ అహ్మద్‌ పీర్‌ ను దుండగులు హత్య చేశారు. ఇదే క్రమంలో... ఇస్లామిక్ స్టేట్‌ టాప్‌ కమాండర్‌ అయిజాన్‌ అహ్మద్‌ అహంగర్‌ అఫ్గాన్‌ లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఇలా పాక్ కు వరుసగా పైకి చెప్పుకోలేని మంట పుడుతుందని చెబుతున్నారు.