Begin typing your search above and press return to search.

కమలా ఎంట్రీతో ట్రంప్ కు భారీ షాక్.. వెల్లడైన తాజా సర్వేలు

అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా ఎంట్రీ అనంతరం నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 4:32 AM GMT
కమలా ఎంట్రీతో ట్రంప్ కు భారీ షాక్.. వెల్లడైన తాజా సర్వేలు
X

ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి అడ్డంకి ఉండదన్న భావన సర్వత్రా నెలకొన్న వేళలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం.. ఇప్పుడు సీన్ రివర్సు అయ్యేలా చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ తప్పుకోవటం.. సీన్లోకి దేశ ఉపాధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న కమలా హ్యారిస్ రావటం తెలిసిందే. బైడెన్ బరిలో ఉన్న వేళలో.. ట్రంప్ వైపు మొగ్గు చూసిన అమెరికన్లు.. కమలా రాకతో సీన్ లో మార్పులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా ఎంట్రీ అనంతరం నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. వీటి సారాంశం ఏమంటే.. డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం కమలాకు ఉన్నట్లుగా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రాయిటర్్.. ఇప్పాస్ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ లో ట్రంప్ నకు 42 పాయింట్లు లభించగా.. కమలాకు 44 పాయింట్లు రావటం ఆసక్తికరంగా మారింది.

ఇదే సందర్భంగా పీబీఎస్ న్యూస్.. ఎన్ పీఆర్, మారిస్ట్ సంయుక్తంగానిర్వహించిన మరో సర్వేలోనూ ట్రంప్.. కమలా మధ్య హోరాహోరీ పోటీ నెలకొందన్న విషయం స్పష్టమైంది. ఈ ప్రీపోల్ లో ట్రంప్ నకు 46 శాతం మంది మద్దతు లభిస్తే.. కమలాకు 45 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి బైడెన్ తప్పుకోవటం సరైన నిర్ణయంగా పార్టీలకు అతీతంగా.. అన్ని వయస్కుల వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బైడెన్ నిర్ణయం కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిచే అవకాశాలు పెరిగినట్లుగా 41 శాతం మంది అభిప్రాయపడినట్లుగా సర్వే రిపోర్టులు స్పష్టం చేపడుతున్నాయి. నిజానికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని డెమొక్రాట్లు ఇంకా ఫైనల్ చేయలేదు. బైడెన్ తప్పుకున్న వేళ.. ఆయన తన వారసురాలిగా కమలా పేరును ప్రతిపాదించటం తెలిసిందే. దీనికి ఆమె సైతం ఓకే చెప్పటంతో ఆమె రేసులోకి వచ్చారు. కానీ.. డెమొక్రాట్లు ఆమెను అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కమలా ఇంతటి ప్రజాదరణను సొంతం చేసుకోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

కమలా వైపు ఇంతటి మద్దతు రావటానికి వయసు ఒక కారణంగా చెబుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ వయసు ప్రస్తుతం 78 ఏళ్లు కాగా.. కమలా హ్యారిస్ వయసు కేవలం 59 ఏళ్లు మాత్రమే. ఇది కూడా ఆమె వైపు అమెరికన్ ఓటర్లు మొగ్గు చూపుతున్న కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ టీం తాజాగా కమలా మీద కంప్లైంట్ చేశారు. ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకున్న వేళ.. ఆయన ప్రతిపాదించిన కమలా ఆయన సేకరించిన నిధుల్నిఖర్చు చేస్తున్నారు. ఈ తీరు సరికాదంటూ ట్రంప్ టీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.