Begin typing your search above and press return to search.

లోకేశ్ పాదయాత్రకు హైప్ తెచ్చేందుకు ఇన్ని ప్రయాసలా?

లోకేశ్ పాదయాత్ర హైప్ కోసం ఏఐ యాంకర్ ను తెచ్చేశారు

By:  Tupaki Desk   |   20 July 2023 4:36 AM GMT
లోకేశ్ పాదయాత్రకు హైప్ తెచ్చేందుకు ఇన్ని ప్రయాసలా?
X

టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన పార్టీ ముందుంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. మరి.. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేసే విషయంలో ఈ పార్టీ ఎందుకు వెనుకబడి ఉంటుందన్న ప్రశ్న పలువురిని తొలిచేస్తుంటుంది. సాంకేతికతను అందిపుచ్చుకొనే విషయంలో చంద్రబాబు.. ఆయనకు చెందిన టీడీపీలో అంత సీన్ లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కాకుంటే.. అప్పుడప్పుడు హైప్ కోసం ప్రచారమే తప్పించి.. అసలు విషయం శూన్యమంటూ తెలుగు తమ్ముళ్లే విరుచుకుపడుతుంటారు.

ఇదంతా ఎందుకంటే.. కొన్ని నెలలుగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర అనుకున్నంతగా సక్సెస్ కాలేదన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అయిపోవటం.. ప్రధాన మీడియాలోనూ లోకేశ్ పాదయాత్రకు సరైన ప్లేస్ మెంట్ ఇవ్వకపోవటం కూడా ప్రజాదరణ ప్రాతిపదికనే అన్న మాట వినిపిస్తోంది. ఎన్ని జాకీలతో లేపుతున్నా లేవని పాదయాత్రకు కొత్త హైప్ క్రియేట్ చేసేందుకు ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) సాయంతో ఒక యాంకర్ ను క్రియేట్ చేశారు.

ఆ యాంకరమ్మకు ‘‘వైభవి’’ అన్న పేరును పెట్టారు. దీన్ని ఐ టీడీపీ కనిగిరి విభాగం రూపొందించింది. లోకేశ్ పాదయాత్ర వార్తల్ని.. విశేషాల్ని వైభవి చేత చదివిస్తూ.. లేని హైప్ ను తీసుకురావటం కోసం తెలుగు తమ్ముళ్లు కిందా మీదా పడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర విశేషాల్ని వివరిస్తున్న డిజిటల్ యాంకర్ వైభవితోకూడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించిన తొలి రాజకీయ పార్టీ టీడీపీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. టెక్నాలజీని వాడగానే సరిపోతుందా? ప్రజలకు ఎక్కాలి? ఓట్ల వర్షం కురిపించాలి.. అధికారాన్ని చేతికి ఇవ్వాలి. ఇవన్నీ ముఖ్యం కానీ.. అద్భుతమైన సాంకేతికత అంటూ చెప్పుకునే మాటలతో ప్రయోజనం పెద్దగా ఉండదన్న విషయాన్ని తమ్ముళ్లు ఎప్పటికి గుర్తిస్తారో?