Begin typing your search above and press return to search.

భారతీయుల్లో అత్యధికంగా వాడుతున్న ఏఐ టూల్ ఇదే

తాజాగా భారత ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏఐ వినియోగం ఎంత ఎక్కువగా పెరిగిందన్న విషయాన్ని తాజాగా విడుదలైన నివేదిక ఒకటి చెప్పేసింది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:01 AM GMT
భారతీయుల్లో అత్యధికంగా వాడుతున్న ఏఐ టూల్ ఇదే
X

మొన్నటివరకు ఏఐ అన్నంతనే కాస్త తడుముకోవటం తెలిసిందే. ఇప్పుడు అది కాస్తా పక్కకు వెళ్లి.. ఏఐను తెగ ఆడేసుకుంటున్న దేశ ప్రజల్లో మన దేశం చేరింది. తాజాగా భారత ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఏఐ వినియోగం ఎంత ఎక్కువగా పెరిగిందన్న విషయాన్ని తాజాగా విడుదలైన నివేదిక ఒకటి చెప్పేసింది.

ఇంటర్నెట్ వినియోగం ఒక రేంజ్ కు చేరిన వేళ.. ఏఐ టూల్స్ అందుబాటులోకి రావటం.. దానితో వివిధ సేవల్ని అందిపుచ్చుకుంటున్నారు మన దేశంలోని ఇంటర్నెట్ యూజర్లు. లోకల్ సర్కిల్స్ సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ప్రస్తుతం కొత్త కొత్త ఏఐ ప్లాట్ ఫామ్స్ వస్తున్న వేళ.. భారతీయులు అత్యధికంగా వినియోగిస్తున్న ఏఐ టూల్ ఏది? అన్న విషయాన్ని ఈ సర్వే వెల్లడించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ విషయానికి వస్తే..

- చాట్ జీపీటీ

- వయా బింగ్

- లామా

- క్లౌడ్

- పర్ ఫ్లెక్సిటీ

- గూగుల్ ఏఐ జెమిని

- మెటా ‘లామా 3’

లాంటివి ఉన్న విషయం తెలిసిందే. ఇలా అనేకరకాలైన ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చిన వేళ.. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 309 జిల్లాల్లోని 92 వేల మంది అభిప్రాయాల్ని ఈ సంస్థ సేకరించింది. ఈ రిపోర్టులో అన్నింటి కంటే ముందు ప్రస్తావించాల్సిన అంశం.. ఇప్పటికే ఏఐ టూల్స్ వాడుతున్న వారిలో పలువురు చైనాకు చెందిన డీప్ సీక్ కు మారాలనుకున్న విషయాన్ని ప్రస్తావించినట్లుగా పేర్కొన్నారు.

డీప్ సీక్ కు మారాలనుకున్న వారి సంఖ్య 31 శాతం వరకు ఉంటుందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో వివిధ ఏఐ ఫ్లాట్ ఫామ్ లను వినియోగించి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది ఫిర్యాదు చేయగా.. 28 శాతం మంది మాత్రం కచ్ఛితమైన సమాచారం వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏఐ ప్లాట్ ఫామ్ లను వాడమని.. అదే సమయంలో గూగుల్.. ఇతర సెర్చ్ ఇంజిన్లను వాడతామని 40 శాతం పేర్కొనటం గమనార్హం. ఈ విషయంలో తాము ఏమీ చెప్పలేమన్న వాళ్లు ఐదు శాతం ఉన్నారు.

ఇంతకూ ఏఐ ఫ్లాట్ ఫామ్ ను ఎందుకు వాడుతున్నారు? అని ప్రశ్నించగా.. అత్యధికులు (66 శాతం మంది) సమాచారం కోసమని పేర్కొన్నారు. సెర్చింజన్లలో సులువుగా దొరకని సమాచారం కోసమని 25 శాతం మంది పేర్కొంటే.. ఏదైనా విషయాన్ని సులువుగా రాసేందుకు వినియోగిస్తున్నట్లుగా 9 శాతం మంది చెప్పారు. ఫోటోల్ని రూపొందించేందుకు 9 శాతం మంది.. వీడియోలను ఎడిట్ చేయటానికి 9 శాతం మంది వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్యుమెంట్లను సింఫుల్ ఫై చేసేందుకు 25 శాతం మంది ఏఐ టూల్స్ మీద ఆధారపడుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఏఐ ఫ్లాట్ ఫామ్ లు ఇచ్చే సమాచారంలో కచ్ఛితత్వం ఎంతన్న అంశానికి వస్తే.. అత్యంత కచ్ఛితమైనదని 8 శాతం మంది..చాలావరకు కచ్ఛితమైన సమాచారమే ఇస్తుందని 20 శాతం మంది.. కొంతవరకు ఫర్లేదని 49 శాతం మంది.. పూర్తిగా తప్పుడు సమాచారమని 18 శాతమని.. అసలేం చెప్పలేమని 5 శాతం మంది పేర్కొన్నారు. ఇక.. ఏఐ ఫ్లాట్ ఫామ్ లను ఎలా వాడుతున్నారన్న దానికి టెక్ట్స్ ఫార్మాట్ లో 90 శాతం మంది వాయిస్ మెసేజ్ లో 10 శాతం మంది వాడుతున్న విషయాన్ని వెల్లడించారు.