హోంవర్క్ కోసం ఓ మెషిన్... ఇంత టాలెంటెడ్ ఎవరు గురూ?
టెక్నాలజీ రోజు రోజుకీ ఏస్థాయిలో అభివృద్ధి చెందుతుందనేది తెలిసిన విషయమే
By: Tupaki Desk | 23 July 2024 2:45 AM GMTటెక్నాలజీ రోజు రోజుకీ ఏస్థాయిలో అభివృద్ధి చెందుతుందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తెరపైకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం మొత్తం మాయాలోకం అయిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఓ విద్యార్థి హోంవర్క్ రాసే యంత్రాన్ని కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును... తన హోంవర్క్ చేయడానికి ఓ విద్యార్థి ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. ఇందులో అచ్చం తన చేతిరాతలానే ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నాడు. ఆఖరికి పేజీ పూర్తైన తర్వాత పేపర్ తిప్పే పని కూడా పెట్టుకోనవసరం లేకుండా ప్లాన్ చేశాడు. ఇలా విద్యార్థి దస్తూరితో పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతూ హోం వర్క్ చేస్తున్న ఈ మెషిన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అయితే... ఈ వీడియో ఇనోవేటర్, మెషిన్ కోసం ఉపయోగించిన టెక్నాలజీ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయలేదు! ఈ వీడియోలో... మెషిన్ సదరు విద్యార్థి చేతిరాతను అసైన్మెంట్ చేయడానికి ముందుగా దస్తూరిని స్కాన్ చేస్తుంది. ఈ సమయంలో ఆ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్న ఏఐ... దానిని కాగితంపై ఏజ్ ఇటీజ్ గా రాసేస్తుంది. అది పూర్తి చేసిన హోంవర్క్ చూసినవారు.. విద్యార్థే స్వయంగా రాసినట్లు భావిస్తారు.
దీంతో... విద్యార్థులు, ఉపాధ్యాయులూ ఇలా హోంవర్క్ కోసం ఏఐపై ఆధారపడటం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడానికి ఇలాంటి టెంపరరీ పరిష్కారాలు చూసుకున్నప్పటికీ.. ఇది చేతివ్రాత నైపుణ్యాల క్షీణతకు దారి తీస్తుందని అంటున్నారు.