Begin typing your search above and press return to search.

ఆగిన గుండె గంటన్నర తర్వాత కొట్టుకుంటే.. ఇట్టుంటాది!

వివరాళ్లోకి వెళ్తే... శుభాకాంత్ సాహూ (24) అనే జవాన్ గత నెల 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో చేరాడు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 4:04 AM GMT
ఆగిన గుండె గంటన్నర తర్వాత కొట్టుకుంటే.. ఇట్టుంటాది!
X

గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. లబ్ డబ్ అనే శబ్ధం మౌనంగా మారితే.. ఆ వ్యక్తి మరణించాడని వైద్యులు కన్ ఫాం చేసేస్తారు! కొన్ని సార్లు సడన్ గా స్ట్రోక్ వచ్చి ఆగిపోతే.. ముందుగా సీపీఆర్ చేసి ప్రయత్నిస్తారు. అప్పటికీ స్పందించకపోతే ఆశలు వదిలేసుకుంటారు! కానీ... తాజాగా ఆగిన గుండెను 90 నిమిషాల తర్వాత కదిలించారు ఎయిమ్స్ వైద్యులు!

అవును... సుమారు గంటన్నర పాటు ఆగిపోయిన గుండె తిరిగి లబ్ డబ్ అని శబ్ధం చేయడం మొదలుపెడితే.. రక్తాన్ని పంపింగ్ చేయడం మొదలుపెడితే.. ఎలా గుంటుంది? అసలు అది సాధ్యమేనా? అనే సందేహాలు అవసరం లేదు! ఆగిన 90 నిమిషాల తర్వాత ఓ సైనికుడి గుండెను విజయవంతంగా పునరుద్ధరించారు భువనేశ్వర్ లోని ఎయిమ్స్ వైద్యులు.

వివరాళ్లోకి వెళ్తే... శుభాకాంత్ సాహూ (24) అనే జవాన్ గత నెల 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి గుండే ఆగిపోయింది. దీంతో.. సుమారు 40 నిమిషాల పాటు సంప్రదాయ సీపీఆర్ నిర్వహించారు వైద్యులు. అయితే... గుండెలో ఎలాంటి చలనం లేదు.

అయినప్పటికీ వైద్యులు పట్టు విడువలేదు. పలు చర్చోపచర్చల అనంతరం ఎక్స్ ట్రాకార్పోరియల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) ను ప్రయోగించాలని భావించారు. ఈ మేరకు వైద్య బృందం నిర్ణయించుకుంది. ఈ సమయంలో.. డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని టీమ్... ఎక్స్ ట్రాకార్పోరియల్ మైంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో)తో చికిత్స ప్రారంభించింది.

అయితే.. ఈ చికిత్స సక్సెస్ అయ్యింది. ఆగిన తర్వాత సుమారు 90 నిమిషాల అనంతరం సదరు సైనికుడి గుండె తిరిగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సుమారు 30 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడింది. దీంతో... 96 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నాడు!

ఈ సందర్భంగా స్పందించిన ఎయిమ్స్ వైద్యులు... ఎక్మో అనేది వేర్వేరుగానూ, ఉమ్మడిగానూ గుండె, ఊపిరితిత్తుల విధులను నిర్వహిస్తుందని.. తాజాగా సైనికుడికి నిర్వహించిన ఈ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నది అని.. అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో ఇది చికిత్సకు అనువైందని తెలిపారు.