Begin typing your search above and press return to search.

ఏఐతో 20 శాతం ప్రపంచం అంతం!

టెక్నాలజీ ప్రవేశంతో చాలా రంగాల్లో మానవుల జీవితం అంతకంతకూ సులభతరమవుతోంది.

By:  Tupaki Desk   |   5 April 2024 10:30 AM GMT
ఏఐతో 20 శాతం ప్రపంచం అంతం!
X

టెక్నాలజీ ప్రవేశంతో చాలా రంగాల్లో మానవుల జీవితం అంతకంతకూ సులభతరమవుతోంది. మరోవైపు అంతకంతకూ పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రవేశంతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కృత్రిమ మే«ద (ఏఐ)తో అనేక రంగాల్లో ప్రయోజనాలున్నప్పటికీ ఇది మనిషి మెదడు స్థాయిని మించి ఆలోచించడం మొదలుపెడితే మానవాళి అంతం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా టెస్లా, స్పేస్‌ ఎక్స్, ఎక్స్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐతో 20 శాతం మానవ జనాభా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏఐ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందులో అనేక లోపాలు కూడా ఉన్నాయని ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా ఎలాన్‌ మస్క్‌ ఏఐపై జరిగిన నాలుగు రోజుల సదస్సులో పాల్గొన్నారు. ఇందులో కృత్రిమ మేధపైన ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అది కలిగించే ప్రమాదాల గురించి వివరించారు.

ఏఐ మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. దాదాపు 10 నుంచి 20 శాతం జనాభా ఏఐ కారణంగా అంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన బాంబుపేల్చారు.

2030 నాటికి ఏఐ మనుషుల తెలివితేటలను మించి ఆలోచించగలదని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. దాని వల్ల కొంత మంచి జరిగే అవకాశం ఉన్నప్పటికీ చెడు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఈ నేపథ్యంలో మనం ఏఐ గురించి జాగ్రత్తగా ఉండాల్సిందేనని తెలిపారు.

ఏఐని వినియోగించడం తెలివైన పిల్లవాడిని పెంచడం లాంటిదని మస్క్‌ అభిప్రాయపడ్డారు. తెలివైన పిల్లవాడిని తల్లిదండ్రులు సరిగా పెంచితే బాధ్యతాయుతంగా పెరుగుతాడని, లేకపోతే చెడ్డదారి పడతాడన్నారు. అలాగే ఏఐని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ఇలాంటి స్పష్టత అవసరమన్నారు. ఏఐకి ఎప్పుడూ నిజం చెప్పాలని మస్క్‌ సూచించారు. దానికి అబద్ధాలు చెబితే అది కూడా మనతో అలాగే వ్యవహరిస్తుందన్నారు. ఆ తర్వాత దాన్ని ఆపడం కష్టమవుతుందన్నారు.

కాగా మస్క్‌ గత కొంతకాలంగా ఏఐ గురించి ఆందోళన చెందుతున్నారు. ఏఐ మానవాళిగా చెడుగా మారే అవకాశం ఉందని గత నవంబర్‌ లోనే ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏఐకి నియమాలు ఉండాలని, దాన్ని మరింత మెరుగ్గా చేయాలని ‘ఎక్స్‌ ఏఐ’ అనే కంపెనీని ఎలాన్‌ మస్క్‌ స్థాపించారు.

కాగా ప్రపంచంలోని టాప్‌ టెక్‌ లీడర్లు సైతం ఏఐ మానవాళిని అంతం చేస్తుందని నమ్ముతున్నారు. ఏఐ మానవాళిని నాశనం చేయగలదని ఆందోళన చెందుతున్నారు. యేల్‌ లో ఇటీవల జరిగిన సీఈఓల సదస్సులో 42 శాతం మంది సీఈఓలు ఏఐ రాబోయే కొన్ని ఏళ్లలో మానవాళి మనుగడకు ముప్పు కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల తర్వాత మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఏఐకి ఉందని నమ్ముతున్నట్లు సీఈవోల సదస్సుపై వెలువడిన సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో వాల్‌మార్ట్, కోకా–కోలా, జిరాక్స్, జూమ్‌ వంటి బడా కంపెనీల సీఈవోలు 119 మంది పాల్గొన్నారు.