అందంగా తయారవుతోందని.. స్నేహితులతో కలిసి భర్త దారుణం!
సంప్రదాయ పద్ధతిలో మాత్రమే ఉండాలని.. ఈ అతి పోకడలు పోవద్దని పలుమార్లు అతడు తన భార్య దివ్యను హెచ్చరించాడు.
By: Tupaki Desk | 15 Aug 2024 10:30 AM GMTతన భార్య అందంగా, స్టైలిష్ గా తయారుకావడం ఇష్టం లేని భర్త ఆమెను తన స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన ఉదంతం కర్ణాటకలో సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో రామనగర జిల్లా మాగడికలో ఉమేశ్, దివ్య అనే దంపతులు ఉంటున్నారు. ఈ క్రమంలో 32 ఏళ్ల దివ్య అందంగా, స్టైలిష్ గా ఉండటానికి ఇష్టపడేది. భుజంపైన టాటూ కూడా వేయించుకుంది. ఎప్పుడూ మోడ్రన్ గా ఉండటానికి దివ్య ప్రయత్నించేది. లిప్ స్టిక్ తో ఉండేది. అయితే ఇలాంటివేవీ ఉమేశ్ కు ఇష్టం ఉండేవి కావు. సంప్రదాయ పద్ధతిలో మాత్రమే ఉండాలని.. ఈ అతి పోకడలు పోవద్దని పలుమార్లు అతడు తన భార్య దివ్యను హెచ్చరించాడు.
అందంగా, స్టైలిష్ గా ఉండటం తప్పెలా అవుతుందని భార్య దివ్య పలుమార్లు అతడిని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తాజాగా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా కోర్టులో విచారణకు కూడా హాజరయ్యారు.
అయితే అక్కడ తన భార్య దివ్యకు భర్త ఉమేశ్ క్షమాపణలు చెప్పాడు. నీకు నచ్చినట్టే ఉండొచ్చని ఆమెను నమ్మించాడు. తనకు భర్త క్షమాపణలు చెప్పడంతో ఆమె కూడా సంతోషించింది. అతడి మాటలు పూర్తిగా నమ్మింది. ఇక తన భర్తతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.
అక్కడి నుంచి తన భార్య దివ్యను ఊజగల్లులోని దేవాలయానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉమేశ్ తన నలుగురు స్నేహితులను ఉంచాడు. కొండపైకి చేరుకున్నాక ఉమేశ్ తన స్నేహితుల సాయంతో తన భార్యను దారుణంగా హత్య చేశాడు.
తర్వాత తన భార్య మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చారు. అడవిలో మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆ శరీరం దివ్యదని నిర్ధారించుకున్నారు. భర్తతో గొడవలు జరుగుతున్నాయనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నారు. అయితే అప్పటికే ఉమేశ్ పరారీలో ఉన్నాడు. ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమేశ్‌తోపాటు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
మహిళలు సాధారణంగా అందంగా ఉండాలని తపిస్తారు. కట్టుబొట్టు, అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అంతమాత్రానికే భార్యను అంతమొందించడం ఏమిటని దివ్య బంధువులు, కుటుంబ సభ్యులు ఉమేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. దివ్యను నమ్మించి ఆమె ప్రాణాలు బలిగొన్న ఉమేశ్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.