'విమానం'.. జీవిత కాలం ఆలస్యం.. వాయు సేన చీఫ్ అసహనం!
ఈ పరిస్థితిపై భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధ విమానాల డెలివరీలో జాప్యంపై ఆయన అసంతృప్తి కనబర్చారు.
By: Tupaki Desk | 9 Jan 2025 12:30 AM GMTస్టెల్త్ ఫైటర్ జెట్ లు.. ఇవి ఐదో తరం యుద్ధ విమానాలు. శత్రు రాడార్లకు చిక్కకుండా తప్పించుకునే విమానాలు. ఇటీవల రెండు స్టెల్త్ ఫైటర్ జెట్ లను ఆవిష్కరించింది చైనా. వీటికి మళ్లీ మళ్లీ ఇంధనం సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు. గంటకు 1200 కిలోమీటర్ల పైగా వేగం. బ్యాలెన్స్ కోల్పోకుండా ఎటైనా తిరుగుతాయి. ఇలాంటి అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే, ఇటీవల చైనా ఆరో తరం యుద్ధ విమానాన్ని కూడా ప్రదర్శించింది. దీని పేరు ‘వైట్ ఎలిఫెంట్’/జె-36. డ్రాగన్ వాయుసేనపై భారీగా సొమ్ము వెచ్చిస్తోంది.
భారత్ మాత్రం ఐదో జనరేషన్ ఫైటర్ ప్రోగ్రామ్, అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ డిజైన్ దశలోనే ఉంది. చైనా స్థాయిలో కాకున్నా ఫైటర్ జెట్ ల విషయంలో భారత్ కూడా అప్ డేట్ అవ్వాలి. కానీ, మన వద్ద 4వ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి.
ఈ పరిస్థితిపై భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధ విమానాల డెలివరీలో జాప్యంపై ఆయన అసంతృప్తి కనబర్చారు. సాంకేతికతను ఆలస్యం చేయడం అంటే దాన్ని తిరస్కరించడంతో సమానం అని కూడా పేర్కొన్నారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్.. తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ ల డెలివరీ 2016లో మొదలుపెట్టింది. ఇంకా 40 విమానాలను తయారు చేయాల్సి ఉంది. దీన్ని ఉద్దేశించే ఏపీ సింగ్ తన అభిప్రాయం తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటురంగాన్ని కూడా బలోపేతం చేయాలని సూచించారు. అలా చేస్తే ఆర్డర్లు కోల్పోతామనే భయం నిర్మాణ సంస్థలకు ఉంటుందని పేర్కొన్నారు.
తేజస్ తయారీని 2016లో మొదలుపెట్టి.. 2021లో పూర్తి చేసిన సంగతిని ఏపీ సింగ్ గుర్తు చేశారు. 8 ఏళ్లలో తొలి 40 విమానాల డెలివరీ కూడా పూర్తికాని సంగతిని గుర్తు చేశారు. వివాదాలు, పోటీ గణనీయంగా పెరిగి ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్న ఏపీ సింగ్.. పాక్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించారు.
ఆయన మాటల్లో అర్థం ఉంది..
ఆరో తరం ఫైటర్ జెట్ నూ ప్రదర్శించిన చైనా.. పాకిస్థాన్ కు రెండేళ్లలో 40 జే-35 ఫైటర్ జెట్లు ఇవ్వనుంది. రాడార్లకు అందని, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలున్న అత్యంత అధునాతన ఐదో తరం యుద్ధ విమానాలు ఇవి. ఈ తరహా ఫైటర్ జెట్ల తయారీకి భారత్ ‘ఏఎంసీఏ’ ప్రాజెక్ట్ చేపట్టింది. కానీ, 2034లో మాత్రమే అందుబాటులోకి రానుంది.