Begin typing your search above and press return to search.

భారత్ - కెనడా మధ్యలో ఖలిస్తాన్... అసలు ఏమిటీ కథ?

అవును... 1985 జూన్ 23న ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబులతో గాల్లోనే పేల్చేసిన ఘటన విషయంలోనే కెనడా.. భారత్ విషయంలో తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 2:30 AM GMT
భారత్ - కెనడా మధ్యలో ఖలిస్తాన్... అసలు ఏమిటీ కథ?
X

గత కొంతకాలంగా భారత్ విషయలో కెనడా వైఖరి తీవ్ర వివాదాస్పదంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలా అని ఈ వ్యవహారం ఇప్పుడే మొదలైంది కాదు.. 1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో యునైటెడ్ కింగ్ డమ్ కు బయలుదేరిన కనిష్క అనే ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబులతో గాల్లోనే పేల్చేసిన ఘటన నుంచి పీక్స్ కి చేరే ఉంది.

అవును... 1985 జూన్ 23న ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబులతో గాల్లోనే పేల్చేసిన ఘటన విషయంలోనే కెనడా.. భారత్ విషయంలో తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. దీనికి ప్రధాన సూత్రధారి కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది తల్వీందర్ సింగ్ పర్మార్ ను భారత్ కు అప్పగించకుండా డ్రామాలాడింది! అప్పుడు ప్రధానిగా ఉన్నది ఇప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి ప్రిరే ట్రూడో.

నాటి నుంచి మొదలైన ఈ వ్యవహారం ఇటీవల జస్టిన్ ట్రూడో అనుసరిస్తోన్న ఓటు బ్యాంకు రాజకీయాలతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా కెనడా - భారత్ మధ్య దౌత్య సంబంధాలను పతనం చేసింది. దీనికి ప్రధాన కారణం... కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడమే.

నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం భారత్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోంది. అక్కడితో ఆగని ట్రూడో ప్రభుత్వం... భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను అనుమానితుడిగా చేర్చింది. ఆయనను విచారించవలసి ఉంటుందని భారత విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలు చూపించాలని సూటిగా ప్రశ్నించింది.

ఇదే సమయంలో... కెనడా హైకమిషనర్ తో పాటు ఆరుగురు దౌత్యవేత్తలను కొన్ని గంటల వ్యవధిలోనే దేశం నుంచి బహిష్కరించింది. అక్టోబర్ 19వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేసింది! ఇదే సమయంలో... కెనడాలో దౌత్యవేత్తలను, ఇతర అధికారులను, సిబ్బందిని ఢిల్లీకి రావాలని సూచించింది.

ఈ సమయంలో స్పందించిన ట్రూడో... ఖలిస్థానీ అనుకూలవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తమ వద్ద నిఘా సమాచారం మాత్రమే ఉందని.. అంతే తప్ప పక్కా ఆధారాలేవీ లేవని సన్నాయినొక్కులు నొక్కారు! దీంతో... భారత్ మరింత మండిపడింది. ఈ విషయంలో తాము ఎంతోకాలంగా చెబుతున్నదే ఈ రోజు రుజువైందని స్పష్టం చేసింది.

జస్టిన్ ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో భారత్ విషయంలో తన వైఖరిని చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగా... భారత్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ వర్గీయులకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే... సిక్కు వర్గీయులు ట్రూడో పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉండటంతో.. వారు ఏమి చేసినా ట్రూడో వెనకేసుకొస్తుంటారు.

అసలు ఎవరీ ఖలిస్తాన్ ఉగ్రవాదులు..?:

భారతదేశం బ్రిటీష్ వాళ్ల పాలనలో ఉన్న సమయంలో బ్రిటన్ తరుపున భారత సైనికులు ప్రపంచంలోని పలుదేశాలకు వెళ్లారు. అలా చాలా మంది సిక్కులు పంజాబ్ నుంచి వెళ్లి కెనడాలో స్థిరపడ్డారు. పైగా అందుకు కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలు కూడా వీలైనంత సానుకూలంగా ఉండటంతో భారత్ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి.

ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య సమయంలో తమకు ప్రత్యేక సిక్కు దేశం "ఖలిస్తాన్" కావాలని సిక్కులు ఉద్యమించారు. అయితే ఈ ఉద్యమంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీంతో... 1984 సిక్కు అల్లర్ల అనంతరం చాలా మంది సిక్కులు కెనడాకు వలసవెళ్లారు. అక్కడ నుంచే భారత్ లో అలజడులు సృష్టించే పనికి ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే... 1985 జూన్ లో ఎయిరిండియాకు చెందిన కనిష్క విమానాన్ని పేల్చేసిన కేసులో ప్రధాన నిందితుడైన తల్వీందర్ సింగ్ పర్మార్.. పంజాబ్ లో ఇద్దరు పోలీసులను కాల్చి కెనడాకు పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఖలిస్తానీలపై చర్యలు తీసుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు!

ఈ క్రమంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలో ఓ భాగమైపోయారు.. అత్యంత శక్తివంతులుగా మారిపోయారు. ఇదే సమయంలో... ఆ దేశ రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికితోడు కెనడాలోని సిక్కుల మద్దతుతో న్యూ డొమోక్రటిక్ పార్టీ పెట్టిన జగ్మీత్ సింగ్... ట్రూడో ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు.

తాజా రచ్చకు (పరోక్ష) కారణమైన నిజ్జర్ ఎవరు..?:

దశాబ్ధాలుగా కెనడా – భారత్ మధ్య ఉన్న రచ్చ ఇటీవల మరింత తీవ్ర స్థాయికి చేరడానికి ప్రధాన పరోక్ష కారణం నిజ్జర్ హత్య అనే భావించాలి. సిక్కు వేర్పాటువాదిగా పేరొందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలోని సర్రే నగరంలో హత్యకు గురయ్యాడు. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ ను కాల్చి చంపారు.

ఇతడి హత్య, తదనంతర పరిణామాలే కెనడా - భారత్ మధ్య తాజా రచ్చలో కీలక పాయింట్. పంజాబ్ జలంధర్ లోని బార్సింగ్ పూర్ లో 1977లో జన్మించిన నిజ్జర్ 1997లో తప్పుడు పాస్ పోర్ట్ తో కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. పంజాబ్ లో పలు హత్యలకు పాల్పడిన ఇతడిని 2020లో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఇదే సమయంలో భారత్ లోని అతడి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో గత ఏడాది జూన్ లో నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే... ఇది భారత ఏజెంట్ల పనే అనేది కెనాడా ఆరోపణ. అయితే అందుకు తగిన ఆధారాలు లేవని ట్రూడో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోపక్క... నిజ్జర్ ను పాకిస్థాన్ ఏజెంట్లే చంపి.. భారత్ పై ఆ నెపాన్ని మోపి ఉండోచ్చని కథనాలొచ్చాయి.