స్పెస్ జెట్ పరిస్థితి అలా.. ఎయిరిండియా సీన్ ఇలా
తాజాగా సంస్థలోని 15 శాతం వాటా అమ్మేందుకు ఆ సంస్థ ప్రమోటర్ కం ఛైర్మన్ అజయ్ సింగ్ సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 9 Sep 2024 6:30 AM GMTదేశీయ విమానరంగంలో రెండు విమానసంస్థల పరిస్థితికి సంబంధించిన ఆసక్తికర సన్నివేశంగా దీన్ని చెప్పాలి. ఈ రెండు సంస్థలు కొద్ది కాలం క్రితం సమస్యలతో సహవాసం చేసినవే. అయితే.. తాజాగా ఒక సంస్థ పరిస్థితి మెరుగుపడితే.. మరో సంస్థ పరిస్థితి మాత్రం ఇంకా కుదుట పడలేదు. కొత్త నీరు కోసం ఒకరు.. మరింత సెటిల్ కావటం కోసం ఇంకొకరు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఇంతకూ ఆ రెండు సంస్థలు మరేవోకాదు.. ఒకటి స్పెస్ జెట్.. మరొకటి ఎయిరిండియా. చౌకధరల విమానయాన సంస్థగా పేరున్న స్పైస్ జెట్ కొన్నేళ్లుగా కష్టాలతో ప్రయాణం సాగిస్తూనే ఉంది. తాజాగా సంస్థలోని 15 శాతం వాటా అమ్మేందుకు ఆ సంస్థ ప్రమోటర్ కం ఛైర్మన్ అజయ్ సింగ్ సిద్ధమవుతున్నారు. ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న వేళ.. సంస్థను గట్టెక్కించేందుకు వీలుగా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మాలని ఆయన భావిస్తున్నారు.
రిపేర్లకు గురైన కొన్ని విమానాలు.. ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించకుండా వేస్టుగా పడి ఉంటం.. కోర్టు కేసుల కారణంగా మరికొన్నింటిని వినియోగించకుండా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారింది. దీంతో స్పైస్ జెట్ లో తనకు వాటాలో 10 శాతాన్ని అమ్మేందుకు అజయ్ సింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆయనకు 47 శాతంవాటా ఉంది. తాజాగా వాటా అమ్మకంతో రూ.2వేల కోట్ల వరకు వచ్చే వీలుందని చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు నిధుల సమీకరణ పూర్తి అవుతుందన్న మాట వినిపిస్తోంది.
ఇక.. ఎయిరిండియా విషయానికి వస్తే..టాటా గ్రూపులోకి వచ్చిన తర్వాత నుంచి ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఎయిరిండియా నష్టం 60 శాతం తగ్గటం గమనార్హం. 2022-23లో కంపెనీ నష్టం రూ.11,387 కోట్లు కాగా.. గత ఏడాది నష్టం రూ.4444 కోట్లకు పరిమితమైంది. అంతేకాదు.. టర్నోవర్ లోనూ 23.6 శాతం పెరిగింది. సీట్ల భర్తీ కూడా 82 శాతం నుంచి 85 శాతానికి మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీరోజు సగటున 800 విమాన సర్వీసుల్నినిర్వహించగా..4.04 కోట్ల మంది ప్రయాణించారు.
మొత్తం 55 దేశీయ సర్వీసులు.. 44 అంతర్జాతీయ సర్వీసుల్ని నిర్వహించారు. ఎయిరిండియాతో విస్తారా.. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కనెక్టు విలీన ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు ఎయిరిండియా చెబుతోంది. మొత్తంగా చూస్తే.. టాటా గ్రూపు అధీనంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎయిరిండియా స్థితిగతుల్లో మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.