హైదరాబాద్ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. 5శాతం మరణాలు దాని వల్లేనంట..!
తాజాగా.. ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ మరో కీలక అంశాన్ని వెల్లడించింది.
By: Tupaki Desk | 30 Oct 2024 6:25 AM GMTప్రపంచ దేశాలన్నీ నిత్యం వాయు కాలుష్యంతో సతమతం అవుతూనే ఉన్నాయి. ప్రజలకు నాణ్యమైన గాలి దొరకడం కష్టం అవుతోంది. వాయుకాలుష్యంతో ప్రజలే కాకుండా పక్షులు, జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అంతేకాదు వాయుకాలుష్యంతో ఇళ్లు, వాహనాల రంగులూ మారుతున్నాయి. తాజాగా.. ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ మరో కీలక అంశాన్ని వెల్లడించింది.
వాయు కాలుష్యం వల్ల బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. అలాగే.. వాయు కాలుష్యం వల్ల కొన్ని పదార్థాల కారణంగా కళ్లపైనా ఆ ప్రభావం చూపుతున్నట్లుగా ప్రచారం ఉంది. కళ్లలో డస్ట్ పడడం వల్ల కళ్లు ఎర్రబడడం, పొడిబారడం వంటివి చూస్తూనే ఉన్నాం. దాంతో కళ్లకు కూడా వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు.. గాలిలో నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరగడం వల్ల నాడీ వ్యవస్థకూ ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. అటు గర్భిణులు సైతం వాయు కాలుష్యం బారిన పడడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడుతారని ప్రచారం ఉంది.
వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించడం ద్వారా దగ్గు, ఆయాసం వంటి సమస్యలు నిత్యం వస్తాయి. శ్వాసకోశ సమస్య వల్ల వాటితోపాటే లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. వాయుకాలుష్యం వల్ల మనిషి ఆయుష్షు కూడా తగ్గుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటితోపాటే ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ మరో సంచలన అంశాన్ని పేర్కొంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం చాలా వరకు ఉంటోంది. జనాలకు మించి వాహనాలు ఉండడం.. సిటీకి దగ్గర్లోనే ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ప్రజలకు వాయుకాలుష్యం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని ఏటా వాయుకాలుష్యం చుట్టుముట్టేస్తోంది. చలికాలం వస్తోంది అంటే అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. మరో రాజధాని హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజురోజుకూ ఇక్కడ గాలి నాణ్యత పడిపోతూనే ఉంది. దాంతో ఏటా ఇక్కడ సంభవించే మరణాల్లో 5శాతం వాయు కాలుష్యంతోనే అని ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ తన నివేదికలో వెల్లడించింది.
దేశంలో పది నగరాల్లో వాయుకాలుష్యం కారణంగా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయని ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్’ స్టడీ చేసింది. 2008-2019 మధ్య 36లక్షల మరణాలను అధ్యయనం చేసింది. ఇలా ఏటా 1567 మంది మరణిస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి సమయంలో కాలుష్యం మరింత విపరీతంగా పెరుగుతోంది. పీసీబీ గణాంకాల ప్రకారం సాధారణ సమయంలో పీఎం 2.5 స్థాయి.. ఘనపు మీటరు గాలిలో 35-55 మైక్రోగ్రాములు ఉండగా.. దీపావళి సమయంలో 55-105 మైక్రోగ్రాములకు పెరుగుతోంది. అటు శబ్ద కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.