Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగరానికి డేంజర్ బెల్

చాలా అరుదుగా ఉండే హైదరాబాద్ మహానగర వాతావరణానికి విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 4:46 AM GMT
హైదరాబాద్ మహానగరానికి డేంజర్ బెల్
X

హైదరాబాద్ మహానగర వాసులకు ఒక బ్యాడ్ న్యూస్. దేశంలోని మిగిలిన మెట్రో పాలిటన నగరాలకు భిన్నంగా.. తనదైన విలక్షణత్వంతో.. అరుదైన వాతావరణంతో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే.. తన ప్రేమలో పడేసే హైదరాబాద్ వాతావరణం ఇప్పుడు డేంజర్ బెల్ మోగిస్తోంది. చాలా అరుదుగా ఉండే హైదరాబాద్ మహానగర వాతావరణానికి విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. అలాంటి వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది.

ఆదివారం హైదరాబాద్ మహానగర ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) ఇండెక్స్ ఒక్కసారి పడిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన వైనం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. సిటీలోని కుకట్ పల్లి.. మూసాపేట.. బాలానగర్.. నాంపల్లి.. మెహదీపట్నం పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. దీంతో.. దేశ రాజధాని ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతున్న వైనం బయటకు వచ్చింది.

ఈ నేపథ్యంలో పరిస్థితులు చేజారకముందే చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గాలి నాణ్యత తగ్గే కొద్దీ.. చిన్నారులు.. పెద్ద వయస్కుల్లో శ్వాసకోశ వ్యాధులతో సతమతమం కావటం ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు నగర శివారులో పారిశ్రామిక వాడలు ఉండేవి. నగరం విస్తరిస్తున్న కొద్దీ.. ఆ పరిశ్రమలు కాస్తా నగరం మధ్యకు వచ్చేసిన పరిస్థితి. ఇక.. ప్రధాన రహదారుల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ అంతకంతకూ పెరుగుతూ.. భారీ ట్రాఫిక్ జాంకు కారణమవుతోంది.

నగరంలో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. గాలి నాణ్యత ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హానిగా చెబుతారు. నగరాల్లో వాయు నాణ్యత సూచీ 0-50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లుగా చెప్పాలి. కానీ.. గాలిలో వ్యాపించే కొన్నిరకాల వాయువులు.. వాహనాల పొగ.. ఫ్యాక్టరీల కాలుష్యం.. దుమ్ము.. ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోతోంది. కాలుష్య నియంత్రణ బోర్డు ఉన్నప్పటికీ.. తూతూ మంత్రం చర్యలు తప్పించి.. కాలుష్య నియంత్రణలో అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వాదన వేరేలా ఉంది. ఈ గణాంకాల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే.. ఆరోగ్యానికి హాని చేసే పీఎం2.5 స్థాయిలో ఈ నెలలో ఇప్పటివరకు 8 సార్లు 300 ఇండెక్స్ ను దాటిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. గాలిలో నాణ్యత తగ్గితే.. టూవీలర్ మీద ప్రయాణించే వారి ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. చలికాలంలో పొగమంచు దట్టంగా ఏర్పడి.. భూమికి ఒక కిలోమీటర్ ఎత్తున అది ఆగిపోతుందని.. అది ఒక పొరలా ఏర్పడి కాలుష్యం పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. మొత్తంగా.. హైదరాబాద్ మహ నగర వాయు నాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.