Begin typing your search above and press return to search.

వీల్ చైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాకు 30 ల‌క్ష‌ల జ‌రిమానా.. ఏం జ‌రిగింది?

తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో వీల్ చైర్ ల‌భించ‌క‌.. ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న రెండు రోజుల కింద‌ట ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 11:30 PM GMT
వీల్ చైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాకు 30 ల‌క్ష‌ల జ‌రిమానా.. ఏం జ‌రిగింది?
X

భారత వైమానిక రంగంలో తిరుగులేని వ్య‌వ‌స్థ‌గా ఉన్న ప్ర‌భుత్వ రంగం సంస్థ‌ ఎయిర్ ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. ఈ సంస్థ‌కు ఏకంగా 30 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీజ‌రిమానా విధిస్తూ.. డైరెక్టరేట్ జన‌రల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు.. ప‌లు కీల‌క సూచ‌న‌లు కూడా చేసింది. కాగా, ఈ నిర్ణ‌యంతో ఎయిర్ ఇండియా షేర్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలాయి. ఈ సంస్థ‌పై అంత‌ర్జాతీయ సంస్థ‌లు కూడా పెద‌వి విరుస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల్లోనూ మౌలిక సదుపాయాల క‌ల్ప‌న ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిపోయింది. భారీ ఎత్తున చార్జీలు వ‌సూలు చేస్తున్న విమాన సంస్థ‌లు.. ప్ర‌యాణికుల‌కు క‌నీస స‌దుపాయాలు క‌ల్పించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల ప్ర‌యాణికులు విమాన సిబ్బందితో గొడ‌వ‌లు ప‌డిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. దీంతో మౌలిక స‌దుపాయాల విష‌యంలో రాజీ ప‌డ‌రాద‌ని..ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌లిగించ‌రాద‌ని డైరెక్టరేట్ జన‌రల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ఇటీవ‌లే అన్ని సంస్థ‌ల‌కు స‌ర్క‌ల‌ర్లు జారీ చేసింది.

తాజా ఘ‌ట‌న‌లో ప్రాణాలు పోయి..

తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌లో వీల్ చైర్ ల‌భించ‌క‌.. ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న రెండు రోజుల కింద‌ట ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది. ఇది దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న‌కు కూడా దారి తీసింది. ఇదే ఎయిర్ ఇండియాకు భారీ జ‌రిమానా వేసే ప‌రిస్థితిని క‌ల్పించింది. అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో ఈనెల‌ 12న భారత్‌కు వచ్చిన వృద్ధ దంపతులు ముంబైలోని విమానా శ్రయానికి వ‌చ్చారు. ఈ దంప‌తుల్లో భ‌ర్త వ‌య‌సు 80 ఏళ్లు. పైగా అనారోగ్యంతో ఉన్నారు. దీంతో టెర్మిన‌ల్ వ‌ర‌కు వెళ్లేందుకు వీల్ చైర్ కావాల‌ని కోరారు.

కానీ, సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌హించారు. దీంతో రెండు గంట‌ల పాటు వేచి చూసిన ఆ దంప‌తులు నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆయాసానికి గురై.. ఇమిగ్రేషన్‌ విభాగం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్పందించిన సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించే స‌రికే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న తీవ్ర స్థాయిలో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్.. తీవ్ర‌స్థాయిలో మండి ప‌డింది. దంప‌తులు ఇద్ద‌రూ వృద్ధులైన‌ప్పుడు వీల్ చైర్ ఒక్క‌రికే ఇవ్వ‌డంపై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ.. 30 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన సంఖ్యలో వీల్‌ఛైర్లను స‌మ‌కూర్చుకోవాల‌ని సూచించింది.