Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి: బాహుబలి ఫ్లైట్ తీసుకొచ్చిన ఎయిరిండియా

తాజాగా ఎయిరిండియా చేతికి వచ్చిన విమానం విషయానికి వస్తే.. ఏ350-900 విషయానికి వస్తే ఈ భారీ విమానాన్ని సదూర మార్గాలకు నాన్ స్టాప్ గా ప్రయాణించే వీలు కలుగుతుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 10:30 AM GMT
దేశంలోనే తొలిసారి: బాహుబలి ఫ్లైట్ తీసుకొచ్చిన ఎయిరిండియా
X

మారిన కాలానికి అనుగుణంగా సరైన రీతిలో మార్పులు చేయాలే కానీ.. టాటాల చేతికి వచ్చిన ఎయిరిండియా రూపురేఖల్ని మొత్తంగా మార్చేయొచ్చని చెప్పాలి. దేశంలో మరే విమానయాన సంస్థకు లేని బాహుబలి విమానాన్ని టాటాలకు చెందిన ఎయిరిండియా సొంతం చేసుకోవటమే కాదు.. తొలి ఫ్లైట్ ఢిల్లీకి చేరుకుంది. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ విమాన నిర్మాణ సంస్థ ఎయిర్ బస్ తయారు చేసిన ఈ బాహుబలి విమానం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

ఎయిరిండియాను టాటా గ్రూప్ మళ్లీ సొంతం చేసుకోవటం తెలిసిందే. విశ్వసనీయతకు మారుపేరుగా ఉండే టాటా సంస్థ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియాను సొంతం చేసుకోవటం.. తమ సంస్థే ఈ విమానయాన సంస్థను నిర్వహిస్తామని చెప్పటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. గతానికి సంబంధించిన జడత్వాన్ని వదిలించి.. సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావటానికి వీలుగా కార్యకలాపాల్ని చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ విమాన తయారీలో మాంచి పేరున్న ఎయిర్ బస్ తో టై చేసుకుంది. ఈ సంస్థతో గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వైడ్ బాడీ ఉన్న ఇరవై విమానాలను ఆర్డర్ పెట్టింది ఎయిరిండియా. ఇందులో భాగంగా మొదటి విమానాన్ని ఇండియాకు తరలించింది. మిగిలిన ఫ్టైట్లలో ఐదింటిని వచ్చే మార్చి నాటికి అందజేస్తామని స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఎయిరిండియా చేతికి వచ్చిన విమానం విషయానికి వస్తే.. ఏ350-900 విషయానికి వస్తే ఈ భారీ విమానాన్ని సదూర మార్గాలకు నాన్ స్టాప్ గా ప్రయాణించే వీలు కలుగుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ విమానాల్నితొలుత తక్కువ దూరాలకు మాత్రమే వాడిన తర్వాత సదూర తీరాలకు వీటిని ఉపయోగించాలని భావిస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ విమానాన్ని జనవరి నుంచి వాణిజ్య సేవలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

316 మంది ప్రయాణికులతో ఒకేసారి ప్రయాణించే వీలున్న ఈ భారీ విమానంలో వివిధ క్లాసులు కూడా అందుబాటులోకి వస్తాయి. మొత్తం 316 సీట్లలో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్ లు.. అదనపు లెగ్ రూం ఉన్న ప్రీమియం ఎకానమి సీట్లు 24.. విశాలమైన ఎకానమీ క్లాస్ సీట్లు 264గా పేర్కొన్నారు. ఇక.. టాటాలు ఎయిర్ బస్ కు ఆర్డర్ పెట్టిన విమానాల వివరాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఎయిరిండియా చేతికి ఏ350 విమనాలు 40, ఏ350-900 మోడల్ 20, ఏ350-1000 విమానాలు మరో ఇరవై వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఏ321 నియో 140 ఫ్లైట్లు.. ఏ320 ఫ్లైట్లు డెబ్బై వరకు ఉన్నాయి. మొత్తంగా భారీ ఎత్తున రానున్న కొత్త విమానాలతో ఎయిరిండియా రూపురేఖలే మారిపోనున్నట్లుగా చెప్పక తప్పదు.