తొలిసారి ఓటేస్తున్నారా? అయితే ఈ భారీ ఆఫర్ మీకసమే!
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 19 April 2024 12:30 AM GMTదేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో తొలిదశ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 102 పార్లమెంటు స్థానాలకు ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అయితే.. తొలిసారి ఓటు హక్కు పొంది.. తొలిసారి ఓటు వేసే వారి కోసం.. ఎయిర్ ఇండియా సంస్థ భారీ ఆఫర్ ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పించినా.. ఓటు వేసే అవకాశం మాత్రం లేదు. ఎక్కడ పుట్టామో.. ఎక్కడ మన ఓటు ఉందో అక్కడికే వెళ్లాలి. లేదా.. ఆరు మాసాల ముందే అయినా మార్చుకోవాలి. ఈ పరిస్థితి ప్రతి ఎన్నికలోనూ ఉంది. కాబట్టి తొలిదశ ఎన్నికల్లో ఓటు వేయాలని భావించే తొలి ఓటరు కోసం.. ఎయిర్ ఇండియా ఓ భారీ ఆఫర్ ఇచ్చింది.
ఎక్కడ నుంచి అయినా.. ఓటరు.. తమ ప్రాంతానికి వెళ్లాలని అనుకుంటే ఎయిర్ ఇండియా విమాన సేవలను వినియోగించుకో వచ్చు. దీనిలో 19 శాతం మేరకు టికెట్ ధరలో రాయితీ ప్రకటించింది. దీనిని కేవలం తొలిసారి ఓటు హక్కు పొందిన వారికి మాత్రమే కల్పిస్తున్నట్టు విమానయాన సంస్థ పేర్కొంది. ఈ నెల 29వ తేదీ నాటికి.. ఎయిర్ ఇండియా సేవలు ప్రారంభించి.. 19 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. (#VoteAsYouAre) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపింది. రాయితీ టికెట్లు కోరుకునేవారు.. 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారై ఉండాలని స్పష్టం చేసింది.
ఎలా బుక్ చేసుకోవాలి..
విదేశాలు సహా దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా టికెట్లు రాయితీపై పొందవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది. వీటిని మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ విభాగాలకు వర్తించనుందని పేర్కొంది. అయితే.. ఈ ఆఫర్ కోసం.. ఓటరు కార్డు.. ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ పత్రం.. వంటివి తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. యువత ఓటెత్తేందుకు రెడీ కావొచ్చు!!