ఫైనల్ మ్యాచ్ పోయినా ఎయిర్ లైన్స్ కు మాత్రం లాభాల పంట
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా షాకింగ్ ఓటమికి గురి కావటం.. కోట్లాది మంది గుండెల్లో గునపం దిగిన భావన కలగటం తెలిసిందే
By: Tupaki Desk | 21 Nov 2023 5:02 AM GMTవన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా షాకింగ్ ఓటమికి గురి కావటం.. కోట్లాది మంది గుండెల్లో గునపం దిగిన భావన కలగటం తెలిసిందే. విషాదంగా మారిన ఈ వీకెండ్ భారతీయులు మర్చిపోలేని వేదనను మిగిల్చింది. అయితే.. ఇదంతా ఒక వైపు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విమానయాన సంస్థలు మాత్రం రికార్డుస్థాయి లాభాల్ని నమోదు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. దీపావళి పండుగ సందర్భంగా కూడా నమోదు కాని రికార్డులు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.
పండుగ సీజన్ లో భారీగా వ్యాపారాలు సాగుతాయని భావిస్తారు. అందుకు భిన్నంగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విమానయాన సంస్థలకు భారీగా కలిసి వచ్చిందని చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రోజున దేశంలో సుమారు 4.6లక్షల మంది విమాన ప్రయాణం చేసిన వైనం వెల్లడైంది. దీపావళి సందర్భంగా కూడా జరగని ఈ పని.. క్రికెట్ వరల్డ్ కప్ చేసినట్లుగా పేర్కొన్నారు. గత దీపావళితో పోల్చినా ఫైనల్ మ్యాచ్ రోజున ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా తేల్చారు.
టీమిండియా ఫైనల్ కు చేరటంతో అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ కు హాజరు కావాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉత్సాహం క్రికెట్ అభిమానుల్లోచోటు చేసుకోవటంతో.. సరికొత్త రికార్డులు నమోదయ్యయి. ప్రపంచకప్ ఫైనల్ రోజున అహ్మదాబాద్ కు టికెట్ ధర రూ.20వేల నుంచి రూ.40వేలు ఉన్నప్పటికి లెక్క చేయకుండా ప్రయాణాలు చేసిన వైనం వెల్లడైంది. మరికొందరు మాత్రం ట్రైన్లలోనూ చేరుకున్నారు.
పెరిగిన ఛార్జీలను పట్టించుకోకుండా వచ్చిన ప్రయాణికుల కారణంగా విమానయాన సంస్థల ఆదాయంభారీగా పెరిగినట్లుగా చెబుతున్నారు. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయటం ఒక అరుదైన రికార్డుగా పేర్కొన్న అదానీ గ్రూప్.. ''ఇది మాకు చారిత్రత్మకమైన అవకాశం'' అంటూ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. మొత్తంగా టీమిండియా ఫైనల్ పోరులో ప్రపంచకప్ చేజార్చుకున్నప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం అత్యధిక లాభాల్ని కూడగట్టుకున్నాయి.