వాయుకాలుష్యం వర్సెస్ యాంటీబయోటిక్స్... తెలుసుకోవాల్సిన విషయం!
ఇది ఇలానే పెరిగిపోతే భవిష్యత్ లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయని అంటున్నారు
By: Tupaki Desk | 14 Aug 2023 7:41 AM GMTప్రస్తుతం పెరిగిపోతున్న నాగరికతలో భాగంగా భూమిపై కాలుష్యం పెరిగిపోతుందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మరిముఖ్యంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో వాయుకాలుష్యానికి సంజీవనిలా ఉపయోగపడే వాటితో కొత్త సమస్య ఉందని అంటున్నారు.
అవును.. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి వ్యాదులు వస్తాయని.. ఫల్తీంగా ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే సంగతి తెలిసిందే! అయితే... ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇది ఇలానే పెరిగిపోతే భవిష్యత్ లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయని అంటున్నారు. ఈ మేరకు తాజాగా లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని తెలిపింది.
యాంటీబయోటిక్స్ ని మితి మీరి వాడడం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోందని.. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయని.. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
ఇలా యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారని.. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తోంది.
ఇదే సమయంలో ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్ లు పని చెయ్యకుండా చేసేలా కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు ఈ అధ్యయనం వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
ఇదే క్రమంలో... యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ.. వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోందని అంటున్నారు.