Begin typing your search above and press return to search.

తాజాగా ఎయిర్ టెల్ చెప్పిన మాట వింటే గుండె దడే

కానీ.. ఆ దిశగా అడుగులు పడినా.. సరైన రీతిలో స్పందన లేదనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   11 Oct 2024 4:28 AM GMT
తాజాగా ఎయిర్ టెల్ చెప్పిన మాట వింటే గుండె దడే
X

అవును.. ప్రఖ్యాత టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ చేసిన ఒక అధికారిక ప్రకటన సారాంశాన్ని చూస్తే.. దేశంలో సైబర్ నేరగాళ్ల ఆకలి ఎంత ఎక్కువగా ఉందన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తెలుస్తుంది. సైబర్ నేరగాళ్ల ప్రధాన ఆస్త్రం.. ఫోన్ నెంబరు.. బ్యాంక్ ఖాతానే. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో ఫోకస్ చేస్తే సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయటం పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. ఆ దిశగా అడుగులు పడినా.. సరైన రీతిలో స్పందన లేదనే చెప్పాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడితేనే సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పే వీలుంది.

ఇటీవల కాలంలో ఏఐ సాయంతో ఎయిర్ టెల్ ప్రత్యేక ప్రోగ్రామ్స్ ను సిద్ధం చేసుకోవటం తెలిసిందే. అనుమానాస్పద నెంబర్ల నుంచి కాల్ వస్తే.. దానికి సంబంధించిన హెచ్చరిక డిస్ప్లే కావటం తెలిసిందే. కేవలం 10 రోజుల వ్యవధిలో ఈ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కాల్స్ సంఖ్య అక్షరాల 12 కోట్లుగా పేర్కొంది. ఇంత భారీగా వచ్చిన ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిపింది.

ఈ గణాంకాలు చూస్తేనే సైబర్ నేరగాళ్లు ఎంత ఆకలిగా ఉన్నారో.. అమాయకుల్ని ముంచేసేందుకు ఎంతలా ఆరాటపడుతున్నారో అర్థమవుతుంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న సొత్తు విలువ దగ్గర దగ్గర రూ.1500కోట్లకు పైనే ఉంటుందని అంచనా. సైబర్ నేరగాళ్లు ఎక్కడ ఉంటారో తెలియనిది. ఒకవేళ తెలిసినా.. వారిని పట్టుకోవటం అంత సులువైన పని కాదు.

ఇలాంటి వేళలో.. సైబర్ నేరాలు జరగకుండా ఉండేందుకు.. ఫోన్ కాల్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు మరింత అప్రమత్తంగా ఉండటం.. బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద రీతిలో భారీ ఎత్తున లావాదేవీలు జరిగిన వాటిపై చర్యలు తీసుకుంటే సైబర్ నేరగాళ్ల దూకుడుకు బ్రేకులు వేసే వీలుంది. ఏఐ సాంకేతికతో.. ఒకే నెంబరు నుంచి పెద్ద ఎత్తున దేశంలోని వివిధ ప్రాంతాలకు పదే పదే ఫోన్ కాల్స్ వెళుతున్న నెంబర్లను గుర్తించి.. వాటినిఅనుమానాస్పద నెంబర్లుగా ప్రకటిస్తున్నారు. దాదాపు 200 అంశాలను ప్రామాణికంగా తీసుకొని అనుమానాస్పద కాల్స్ ను గుర్తిస్తున్నట్లుగా ఎయిర్ టెల్ చెబుతోంది. ఇదే రీతిలో మిగిలిన సర్వీసు ప్రొవడైర్లు రంగంలోకి దిగితే.. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.