Begin typing your search above and press return to search.

15 ఏళ్ల కేరళ పిల్లాడి స్టార్టప్ ల గురించి తెలిస్తే వావ్ అంటారంతే

ఆ పిల్లాడి వయసు అక్షరాల పదిహేనేళ్లు. కానీ.. అతగాడు సాధించిన ఘనతల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారంతే.

By:  Tupaki Desk   |   19 July 2024 4:31 AM GMT
15 ఏళ్ల కేరళ పిల్లాడి స్టార్టప్ ల గురించి తెలిస్తే వావ్ అంటారంతే
X

ఆ పిల్లాడి వయసు అక్షరాల పదిహేనేళ్లు. కానీ.. అతగాడు సాధించిన ఘనతల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారంతే. విస్మయానికి గురి చేసేలా ఉండే ఈ వండర్ కిడ్ కేరళకు చెందిన వాడు. ఆ రాష్ట్రంలోని ఏర్పాకులం జిల్లాకు చెందిన ఉదయ్ శంకర్ గురించి చెప్పుకుంటూ వస్తే.. అతగాడు సాధించిన ఘనతలకు ఆశ్చర్యంతో నోట మాట రాదంతే. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివి.. ఆ తర్వాత స్కూల్ కు టాటా చెప్పేసిన ఈ టీనేజర్.. ఇప్పటివరకు ఏడు ఏఐ యాప్ లు.. తొమ్మిది కంప్యూటర్ ప్రోగ్రామ్స్.. సుమారు 15 రకాల గేమ్ లను డిజైన్ చేశాడు.

అంతేనా.. ఇతగాడి పేరు మీద మూడు పేటెంట్లు ఉన్నాయి. మరో నాలుగు పేటెంట్ల కోసం అప్లికేషన్లు పెట్టాడు. ఇన్ని సాధించిన ఇతగాడిని గత ఏడాది ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నాడు. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఐఐటీ కాన్పూర్ ల నుంచి ఏఐ సర్టిఫికేట్ కోర్సులు చేశాడు. ఇంకో వైపు దూరవిద్య ద్వారా పదో తరగతిని పూర్తి చేశాడు.

ఈ పిల్లాడు నాలుగో తరగతిలో ఉన్నప్పుడు రోబెటిక్స్ నేర్చుకోవటం మొదలు పెట్టాడు. ఆన్ లైన్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న ఇతడు.. టెక్నాలజీ అంటే ప్రాణం పెడతాడు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఏఐ గురించి పలు విషయాల్ని తెలుసుకొని.. వాటిల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. పదకొండేళ్ల వయసులోనే ఒక స్టార్టప్ ను స్టార్ట్ చేశాడు. దానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా పేర్కొన్నాడు. ఈ వండర్ కిడ్ ఇప్పుడు ఏఐ.. ఆగ్మెంటెడ్ రియాలిటీ.. వర్చువల్ రియాలిటీ.. గేమ్ డెవలప్ మెంట్ లాంటి కోర్సుల్లో పలువురికి శిక్షణ ఇస్తున్నాడు.