రాజకుటుంబ వారసుడిగా జడేజా... చరిత్ర ఏమిటంటే..?
జామ్ నగర్ రాజ కుటుంబాన్నికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ప్రకటించారు.
By: Tupaki Desk | 12 Oct 2024 9:30 AM GMTజామ్ నగర్ రాజ కుటుంబాన్నికి తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ప్రకటించారు. ఈ మేరకు జామ్ సాహెబ్ శత్రుశాలి సింగ్ మహరాజ్ స్వయంగా ఈ రోజు (12 అక్టోబర్ 2024) ప్రకటించారు. దీంతో... అజయ్ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని శత్రుశాలి సింగ్ మహరాజ్ పేర్కొన్నారు.
అవును... టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్ కు తదుపరి జామ్ సాహెబ్ (మహరాజ్) గా ప్రకటించారు. పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాత జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం విజయం సాధించిన దసరా రోజు కాబట్టి.. ఈ రోజు అజయ్ జడేజాను జామ్ సాహెబ్ గా ప్రకటించారు.
ఈ మేరకు సాహెబ్ శత్రుశాలి సింగ్ మహరాజ్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా... ఇది జామ్ నగర్ ప్రజలకు గొప్ప వరం అని నమ్ముతున్నట్లు తెలిపారు. కాగా.. ఒకప్పటి ప్రిన్స్ లీ స్టేట్ నవాగనర్ నే ఇప్పుడు జామ్ నగర్ గా పిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ రాజకుటుంబ పాలన కొనసాగుతోంది.
జామ్ నగర్ రాజకుటుంబ చరిత్ర:
జామ్ నగర్ రాజకుటుంబ చరిత్ర.. జడేజా రాజవంశం రాజు జామ్ రావల్ తో ముడిపడి ఉంటుంది. ఇతడు క్రీ.శ.1540లో నవనగర్ సంస్థానాన్ని స్థాపించాడు. ఇతడు రంగమతి, నాగమతి అనే రెండు నదుల ఒడ్డున ఒక రాజభవనం, కోట, ఆశాపురా దేవి ఆలయాన్ని నిర్మించాడు.
ఆ సమయంలో రాజా జామ్ రావల్ తో పాటు 36 రకాల రాజ్ పుత్ లు కచ్చా నుంచి నేరుగ జామ్ నగర్ కు వచ్చారు. స్థానిక భాషలో జామ్ అనే పదానికి అధిపతి అని అర్ధం. దీన్ని మొదటిసారిగా రావల్జీ జడేజా ఉపయోగించారు.
అజయ్ జడేజా క్రికెట్ కెరీర్:
జామ్ నగర్ రాజకుటుంబానికి చెందిన అజయ్ జడేజా క్రికెట్ పై ఉన్న అభిమానంతో మైదానంలో అడుగుపెట్టారు. తనదైన ఆట తీరుతో 1992 నుంచి 2000 వరకూ 196 వన్డే, 15 టెస్ట్ మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ రోజుల్లో డేరింగ్ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఫీల్డింగ్ లోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించేవాడు.
జడేజా ఆడిన 15 టెస్టుల్లోనూ 26.18 సగటుతో 576 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 96 గా ఉంది. ఇక 196 వన్డేలు ఆడిన జడేజా... 37.47 సగటుతో 5359 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.