"ఇది పూర్తిగా ఊహించని ఓటమి కాదు"... అజయ్ కల్లం హాట్ కామెంట్స్!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Aug 2024 6:30 AM GMTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. అయితే... వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడానికి గల కారణాలుగా చెబుతున్న వాటిలో సలహాదారుల పాత్ర ఒకటనేది మెజారిటీ నేతల అభిప్రాయంగా ఉందని అంటుంటారు.
ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లుగా వైసీపీ అధికారం కోల్పోయినప్పటినుంచీ జగన్ సలహాదారులందరూ ఒకరి తర్వాత ఒకరు నిశబ్ధంగా నిష్క్రమించిన పరిస్థితి! ప్రస్తుతం గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి హాజరవుతున్నారు తప్ప మిగిలిన వాళ్లు కనిపించడం లేదు.
ఇక తొలినాళ్లలో వైఎస్ జగన్ కు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారనే పేరు సంపాదించుకున్న మాజీ సలహాదారు, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇంకా విడుదల కానప్పటికీ... ప్రస్తుతానికి వినిపిస్తున్న వ్యాఖ్యలు, కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే మాత్రం ఒక క్లారిటీ వస్తోందనే చెప్పాలి. తాజాగా విడుదలైన ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ లో జగన్ మాజీ సలహాదారు కొన్ని కీలక, మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా... "జగన్ ఓటమిని పూర్తిగా ఊహించలేదు అని చెప్పలేను" అని వ్యాఖ్యానించిన అజయ్ కల్లం... తన రోల్ చాలా పరిమితమైందని అన్నారు. ఈ సందర్భంగా ఎవరొకరి ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకోవడం తప్పిస్తే.. వీరు పుణ్యాత్ములు కాబట్టి ఎన్నుకుందాం అనే ఆలోచన ప్రజల్లో ఎవరి పైనా లేదని కల్లం చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో చంద్రబాబుకి తానంటే చాలా ఇష్టమని అజయ్ కల్లం చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో జగన్ ఓటమిలో లిక్కర్ పాలసీ పాత్రనూ అజయ్ కల్లం ప్రస్థావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... ఎన్నడూ వినని విచిత్రమైన మద్యం బ్రాండ్ లను తీసుకొచ్చి, అధిక ధరలకు అందుబాటులోకి తెచ్చి తాగించారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని వెల్లడించినట్లు తెలుస్తోంది.
దీంతో... ఈ ఇంటర్వ్యూలో అజయ్ కల్లాం ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఏయే పనులు, తీసుకున్న ఏయే నిర్ణయాలు జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అని అభిప్రాయపడ్డారు అనే మొదలైన విషయాలపై ఆసక్తి నెలకొంది.