Begin typing your search above and press return to search.

ఇద్దరు మరాఠీల మధ్యన ఫడ్నవీస్!

ఇది మహారాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రాజకీయ అద్భుతంగా అంతా చూశారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 7:45 PM GMT
ఇద్దరు మరాఠీల మధ్యన ఫడ్నవీస్!
X

మహారాష్ట్ర రాజకీయం ప్రస్తుతానికి ఒక కొలిక్కి వచ్చిందని అనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రజలు మూకుమ్మడిగా మహాయుతి కూటమికే మద్దతు ఇచ్చారు. మొత్తం అసెంబ్లీలో ఊడ్చేసినట్లుగా సీట్లు అన్నీ బీజేపీ శివసేన ఎన్సీపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి కట్టబెట్టారు. ఇది మహారాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రాజకీయ అద్భుతంగా అంతా చూశారు.

అక్టోబర్ 26న మహారాష్ట్ర శాసనసభ గడువు పూర్తి అయింది. దాంతో వెంటనే పదవీ ప్రమాణం ఉంటుందని అనుకుంటే దాదాపు పన్నెండు రోజుల తరువాత కానీ ఆ ముచ్చట లేకుండా పోయింది. ఫలితాల వేడి అయితే తగ్గిపోయింది. జనాలలోనూ ఆసక్తి సన్నగిల్లిన తరువాత ఎట్టకేలకు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది.

మహారాష్ట్రలో నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడవసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన అచ్చమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. మహారాష్ట్రలో అత్యధిక శాతం ముఖ్యమంత్రులు అంతా మరాఠీలే కావడం విశేషం. అయితే దానికి భిన్నంగా 2014లో యువకుడు అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ని బీజేపీ పెద్దలు ప్రోత్సహించి గద్దెనెక్కించారు. అలా తొలిసారి ఆయన సీఎం అయ్యారు.

ఇక ఫడ్నవీస్ గురించి చూస్తే ఆయన అసలైన ఆరెస్సెస్ కార్యకర్త. ఆయనకు సంఘ్ నిండు ఆశీర్వాదాలు ఉన్నాయి. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆయన నాగపూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికయ్యారు. 27 ఏళ్లకు నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు.

మూడు సార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా నెగ్గిన చరిత్ర ఉంది. మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసి పార్టీని 2014లో విజయం దిశగా నడిపిన వ్యూహాలు ఆయన సొంతం. ఇక 2019 నవంబరు 23 నుండి 20219 నవంబరు 28 వరకు కేవలం ఆరు రోజుల పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు కూడా ఆయనదే కావడం విశేషం. 2004లో నాగపూర్ వెస్ట్ నుంచి ఎంపీగా కూడా ఆయన పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు.

అయితే మహారాష్ట్రలో కేవలం 10 శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయడాన్ని మరాఠీలు కొందరు వ్యతిరేకిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఎందుకంటే మొత్తం మహారాష్ట్ర రాజకీయాన్ని శాసించేదే మరాఠీలు. ఆ విధంగా చూస్తే కనుక ఇప్పటిదాకా కనీసం 13 మంది సీఎంలు మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు అని చెప్పాలి.

అంతే కాదు మహారాష్ట్రలో మరాఠాలు 75 శాతం పైగా భూమిని కలిగి ఉన్నారు. వారు దాదాపు 55 శాతం విద్యాసంస్థలను, అలాగే 70 శాతం సహకార సంఘాలను తన నియంత్రణలో ఉంచుకుంటూ రాష్ట్రంలోని ప్రధాన శక్తి కేంద్రంగా ఎదిగారు. అంతే కాదు మహారాష్ట్రలోని 105 చక్కెర కర్మాగారాల్లో 86 వారివే కావడం విశేషం. ఇక రాష్ట్ర జనాభాలో సమాజం కేవలం 30 శాతం కంటే ఎక్కువగా వారు ఉన్నారు.

ఈ క్రమంలో మారాఠీలదే ముఖ్యమంత్రి పీఠం అన్నది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. దానిని బీజేపీ బద్దలు కొట్టింది. బీజేపీకి 2014లో అధికారం దక్కడంతో బ్రాహ్మణ సీఎం ని చేసింది. ఆ విధంగా దేవేంద్ర ఫడ్నవీస్ 44 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం పీఠం ఎక్కారు.

ఆయన కంటే ముందు తొలిసారిగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి సీఎం అయిన వారు మనోహర్ జోషీ. ఆయన 1995లో శివసేన నుంచి సీఎం సీటుకు ఎంపిక అయ్యారు. ఆయన తర్వాత ఫడ్నవీస్ మహారాష్ట్రకు రెండవ బ్రాహ్మణ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఇపుడు చూస్తే ఇద్దరు డిప్యూటీలుగా మరాఠాలు అయిన ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్లు ఉండబోతున్నారు.

మరాఠాలు రాజకీయంగా ఆధిపత్యం చూపించాలనుకున్న చోట ఈ సమీకరణలు వారికి ఇబ్బందిగానే ఉంటాయి. అయితే రాజకీయ వ్యూహ చాతుర్యంలో అందరినీ మించిపోయే దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఇద్దరు మరాఠీలను కలుపుకుంటూ అయిదేళ్ల పాలన సీఎం గా పూర్తి చేస్తారని బీజేపీతో పాటు ఆరెస్సెస్ కూడా ధీమాగా ఉన్నాయి.