Begin typing your search above and press return to search.

ఆయన పర్మనెంట్ డిప్యూటీ సీఎం!

దేశంలో డిప్యూటీ సీఎం అంటే సీఎం తరువాత అనే అంతా అనుకుంటారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:03 AM GMT
ఆయన పర్మనెంట్ డిప్యూటీ సీఎం!
X

దేశంలో డిప్యూటీ సీఎం అంటే సీఎం తరువాత అనే అంతా అనుకుంటారు. అదే నిజం కూడా. డిప్యూటీ సీఎం ఎప్పటికైనా సీఎం చెయిర్ ని ఆక్యుపై చేయాలని ఆశిస్తారు. కానీ గడచిన కొన్నేళ్ళుగా డిప్యూటీ సీఎం అంటే ఆయన పేరే వినిపిస్తుంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో డిప్యూటీ సీఎం ఎవరో ఒకరు మారుతున్నారు కానీ మహారాష్ట్రలో మాత్రం కంటిన్యూస్ గా ఆయనే డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు.

చిత్రమేంటి అంటే పార్టీలకు అతీతంగా అన్ని కూటములలోనూ ఆయనే డిప్యూటీగా ఉంటున్నారు అంటే రాజకీయంగా అదొక రికార్డు అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు మరాఠా దిగ్గజనేత అయిన శరద్ పవర్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్.

అజిత్ పవార్ కి గతంలో డిప్యూటీ సీఎం దక్కిన సందర్ఘాలు అనేకం ఉన్నాయి. ఆయన ఇప్పటిదాకా అయిదు సార్లు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1999లో కాంగ్రెస్‌-ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండే మంత్రివర్గాలలో మంత్రిగా చేస్తూనే ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి చేశారు. ఇక 2010లో పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలలో మరోసారి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆ తరువాత ఆయన 2019లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయి కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 2020లో ఏర్పాటు అయిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ కాంగ్రెస్ మహా వికాష్ అఘాడీ మంత్రివర్గంలో మరోసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 2023లో ఆయన మళ్లీ బీజేపీతో చేతులు కలిపి ఇంకో సారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా చూస్తే ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటికి అయిదు సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.

ఇపుడు చూస్తే బీజేపీ నాయకత్వంలో త్వరలో ఏర్పడబోతున్న మహాయుతి ప్రభుత్వంలో ఇంకోసారి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అజిత్ పవార్ తయారుగా ఉన్నారు. ఇది మహారాష్ట్రలోనే కాదు దేశ రాజకీయాల్లోనే రికార్డుగా అంతా చూస్తున్నారు

అజిత్ పవార్ ఏమీ మామూలు నాయకుడు కాదు బారామతి అసెంబ్లీ నుంచి ఏడు సార్లు గెలిచారు. ఆర్ధిక ప్రణాళిక వంటి కీలక శాఖలను నిర్వహించారు. బలమైన నేతగా ముద్ర పడ్డారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది ఎన్సీపీని శరద్ పవార్ స్థాపించిన దాని మొత్తం బాధ్యతలు చూసుకున్నది అజిత్ పవార్. అందుకే ఈ రోజున ఆయన వెంట మెజారిటీ పార్టీ ఉంది. అసలైన ఎన్సీపీ ఆయనదే అని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టతను ఇచ్చింది.

ఇక ఎంపీగా కూడా పనిచేసిన ఆయన అనేక సార్లు మంత్రిగ ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఎప్పటికి ఆయన సీఎం అవుతారు అన్నది అభిమానులలో కలుగుతున్న సందేహం. అయితే తన పార్టీ బలం ఏమిటో ఆయనకు తెలుసు అని అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీకి బలం ఉంది. పెద్ద పార్టీ కాబట్టి ఆ పార్టీతో సర్దుబాటు చేసుకుంటున్నారు. తన ఎన్సీపీకి ముఖ్యమైన శాఖలను తీసుకుని మరోసారి అధికారంలో వాటాను అందుకోవాలని చూస్తున్నారు.

కాలం కలసి వచ్చినపుడు ఏనాటికైనా తాను సీఎం అవుతాను అన్న నమ్మకం అయితే అజిత్ పవార్ లో ఉంది. ఇంకో వైపు ఈ ఎన్నికలతో ఆయన ఎన్సీపీకి అసలైన నేత అయ్యారు అంటున్నారు. శరద్ పవార్ వృద్ధ నేత కావడంతో రానున్న రోజులలో మహా రాజకీయాల్లో చక్రం తిప్పే చాన్స్ ఎటూ అజిత్ పవార్ కి ఉందని అంటున్నారు. మొత్తానికి మరోసారి ఆయన డిప్యూటీ సీఎం గానే కనిపించబోతున్నారు అని అంటున్నారు.