Begin typing your search above and press return to search.

సీఎం పదవి నాకూ కావాలి.. మనసులో మట బయటపెట్టిన తమ్ముడు !

ప్రస్తుతం దేశంలో జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Sep 2024 9:30 PM GMT
సీఎం పదవి నాకూ కావాలి.. మనసులో మట బయటపెట్టిన తమ్ముడు !
X

ప్రస్తుతం దేశంలో జమ్ముకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరునడుస్తోంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శక్తియుక్తులా పోరాడుతున్నాయి. మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సైతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతోంది.

ఎన్‌సీపీ చీఫ్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న అజిత్ పవార్.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తన మనసులోని మాట బయటపెట్టారు. సీఎం పదవిపై తనకు ఉన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. తనకు కూడా సీఎం కావాలని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుగ్డూషేఠ్ హల్ద్వాయ్ గణపతి ఆలయంలో పూజలు చేసిన ఆయన.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి అభిమాని తమ నాయకుడిని సీఎంగా చూడాలని అనుకుంటారని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఎవరైనా సీఎం సీట్లో కూర్చోవాలంటే అందుకు తగిన మెజార్టీ నంబర్ సాధించాల్సి ఉంటుందని తెలిపారు. అలా అని ప్రతి ఒక్కరి ఆకాంక్షలు కూడా నెరవేరవని.. ప్రతీ ఒక్కరికి కోరుకున్నది దక్కదని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల భవిష్యత్ పూర్తిగా ఓటర్ల చేతిలో ఉంటుందని, ఏనాయకుడిని సీఎం చేయాలన్నది వారి ఇష్ట ప్రకారం సాగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 288 స్థానాలకు గాను 145 సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ దక్కినట్లు అవుతుందని చెప్పారు.

తమ కూటమి నాయకుడు ఏక్‌నాథ్ శిండే నాయకత్వంలో తాము ఎన్నికలను ఎదుర్కొంటామని, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చాక అంతా కలిసి చర్చించుకొని సీఎంను ఎన్నుకుంటామని అన్నారు. అయితే.. ఈ సారి ఎన్నికల అనంతరం ఏక్‌నాథ్ షిండేను సీఎంను చేయాలంటూ శివసేన నేతల నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో పవార్ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. దేవేంద్ర ఫడ్నవీస్‌నే మరోసారి సీఎం సీట్లో కూర్చోబెట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇలా ఒక్కో పార్టీ నుంచి ఒక్కో నేత సీఎం పదవిని ఆకాంక్షిస్తుండడంతో రాబోయే కాలంలో మహారాష్ట్ర రాజకీయాలు ఏ వైపు మలుపుతిప్పుతాయనే ఆసక్తి కనిపిస్తోంది.