Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి వెన్నుపోటుకు ఎన్నికల్లో ప్రజల ఓటు పాఠం

దేశంలో ఉత్తర ప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధించడం ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంపై కన్నేసింది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 1:30 PM GMT
ఆ ఇద్దరి వెన్నుపోటుకు ఎన్నికల్లో ప్రజల ఓటు పాఠం
X

ఒకరు.. ఎక్కడో సాధారణ ఆటో డ్రైవర్ గా ఉన్న వ్యక్తి.. మరొకరు బాబాయ్ పెంపకంలో పెరిగిన రాజకీయ నాయకుడు.. కాలక్రమంలో ఆ ఇద్దరూ ఎంతగానో ఎదిగారు. ఉన్నత పదవులు పొందారు. కానీ, తమను చేరదీసినవారికే వెన్నుపోటు పొడిచారు. అయితే, ప్రజలు ఊరుకోరు కదా.. వారికి తగిన గుణపాఠం చెప్పారు.

బాబాయ్ ను దెబ్బకొట్టిన అబ్బాయ్

దేశంలో ఉత్తర ప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధించడం ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంపై కన్నేసింది. దీనికిముందు రెండేళ్లుగా కొన్ని ఘటనలు జరిగాయి. 2022లో శివసేనను నిలువునా చీల్చారు ఏక్ నాథ్ శింథే. తన బాబాయ్ శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని గత ఏడాది ఇదే విధంగా రెండు ముక్కలు చేశారు అజిత్ పవార్. వీరిలో శిందే సీఎం కాగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తదనంతర కాలంలో వీరిద్దరికీ ఆయా పార్టీలు, వాటి గుర్తులు కూడా దక్కాయి. ఈ ఎన్నికల్లో వాటితోనే పోటీకి దిగారు.

బీజేపీతో పొత్తులో భాగంగా శిందే సేన మొత్తం 15 స్థానాల్లో బరిలో దిగి ఏడుచోట్ల నెగ్గింది. అయితే, శివసేనకు బలమైన పట్టుండే ముంబైలో రెండు సీట్లను శివసేన (ఉద్ధవ్) వర్గానికి కోల్పోయింది. శిందే.. రాజకీయ క్షేత్రం థానేతో కూడా వీటిలో ఉండడం గమనార్హం.

అజిత్‌ పవార్‌ ఎస్సీపీ ఐదు స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటులో గెలుపొందింది. అజిత్‌ సతీమణి సునేత్ర బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా చేతిలో ఓడిపోవడం గమనార్హం. ఈ రాష్ట్రంలో 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే ఎన్డీఏ బలం సగానికి పైగా తగ్గిపోయింది. మహా వికాస్ అగాఢీ (ఎంవీయే) గొడుగు కింద పోటీ చేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 30 స్థానాల్లో నెగ్గాయి. శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది నెగ్గిది. తాజా ఫలితాలతో అసలైన ఎన్సీపీ తమదేనని శరద్‌ పవార్‌ నిరూపించుకున్నారు.

ముందుంది అసెంబ్లీ సమరం..

మహారాష్ట్రకు అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు మహా వికాస్ అగాడీ కూటమి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి.