ఇంగిలిపీసూ ఏంటి బాసూ ..అక్బరుద్దీన్ కి అదిరిపోయే కౌంటర్
తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా భాష మీద రచ్చ సాగుతోంది.
By: Tupaki Desk | 27 March 2025 1:31 PMతెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా భాష మీద రచ్చ సాగుతోంది. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండే మజ్లిస్ కి ఎపుడూ భాష విషయంలో ఇబ్బంది రాలేదు. వారు సభలో అయితే ఉర్దూ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడినా సరిపోయేది. దాంతో తెలుగు రాష్ట్రంలో జరిగే సభలో ఆంగ్ల భాష మాట్లాడుతూ దశాబ్దాలుగా మజ్లిస్ ఎమ్మెల్యేలు నాయకులు ఆ భాషే తమ హక్కు అనుకునే స్థితికి వచ్చేశారు అని అంటున్నారు.
అందుకే కేబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క మీద మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ అయితే మీకు ఇంగ్లీష్ హిందీ రాదు నాకు తెలుగు రాదు మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అని విమర్శలు చేశారు. అయితే దానికి సీతక్క చాలా హుందాగానే బదులిచ్చారు. నా మాతృ భాష తెలుగు. నేను అందులోనే మాట్లాడుతాను నాకు హిందీ ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చు అని చెప్పారు.
ఈ విషయం ఇపుడు మరింతగా భాష ఘోషగా రాజుకుంది. అక్బరుద్దీన్ ఒక కేబినెట్ మంత్రిని పట్టుకుని నిండు సభలో మీకు ఇంగ్లీష్ హిందీ రాదు అని అనడమేంటి అన్నది కాంగ్రెస్ వర్గాలతో పాటు బయట కూడా చర్చ సాగుతోంది. అసలు అసెంబ్లీ ఏ రాష్ట్రంలో ఉంది, హిందీ బెల్ట్ లో లేదు కదా అలాగే ఇంగ్లీష్ భాష ఎందుకు మాట్లాడాలి అన్న చర్చకు తెర లేచింది. చక్కగా మాతృ భాషలో మంత్రి మాట్లాడితే నాకు అర్థం కాలేదు మీరు వేరే భాషలలో మాట్లాడండి అని సభ్యులు వివాదం చేయడమేంటి అన్నది కూడా మేధావుల నుంచి అంతటా చర్చకు వస్తోంది.
దీని మీద తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంత్రి సీతక్కకు ఇంగ్లీష్ హిందీ రాదు సరే కానీ హైదరాబాద్ లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు అని సూటిగానే అక్బరుద్దీన్ ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగి అక్కడ మెజారిటీ ప్రజలు మాట్లాడే తెలుగు రాదు అనడమేంటి అని అక్బరుద్దీని ని ప్రశ్నలతో గుచ్చేశారు.
ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఎక్కువగా మాట్లాడే స్థానిక భాష తెలుగు నేర్చుకోవాలని ఎందుకు లేదని ప్రశ్నించారు. మెజారిటీ ప్రజలు మాట్లాడే అధికార భాష తెలుగు నేర్చుకోవాలన్న సామాజిక బాధ్యత ఎందుకు లేదని కూడా నిలదీశారు.
మీరు మాత్రమే ఆంగ్లం హిందీ మాట్లాడుతారని అసెంబ్లీలో సభ్యులు అంతా తెలుగులోనే మాట్లాడుతారని అపుడు మీకు ఏమి అర్ధం అవుతుందని కూడా ఆయన్ని ప్రశ్నించారు. మీకు మీరుగా అసెంబ్లీలో మీ భాషలో ప్రసంగం చేసి వెళ్ళిపోతే సరిపోతుందా అని కూడా అన్నారు. ఇంతకీ తెలుగు రాకపోతే మీకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని కూడా ఎత్తిపొడిచారు.
హిందీ, ఇంగ్లీష్ రాకపోతే మీకు అంత చిన్నచూపా మీకు పొగరు కాకపోతేనూ అంటూ అక్బరుద్దీన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉండి కూడా తమ మంత్రిని కించపరచిన అక్బరుద్దీన్ ని ఏమీ అనలేదని అంటున్నారు. కానీ ఆకునూరి మురళి మాత్రం అసలు ఊరుకోలేదు. ఆయన లేవనెత్తిన పాయింట్లు కూడా బాగానే ఉన్నాయని అంటున్నారు
తెలుగు అసెంబ్లీలో తెలుగు ప్రజలు ఎన్నుకున్న చోట తెలుగు నాకు రాదు అని చెబుతూ దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధిగా ఉన్న వారు బహుశా అక్బరుద్దీన్ మాత్రమే నేమో అని అంటున్నారు. పైగా ఆయన తాను తెలుగు నేర్చుకోకపోవడాన్ని తప్పుగా భావించకుండా ఇంగ్లీష్ హిందీ రాదా అని ఒక మంత్రిని పట్టుకుని సభలో అవమానించడమేంటని సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికైనా సభలో సభ్యులు అందరూ తెలుగులో మాట్లాడాలని ఒక రూలింగ్ ని తెస్తే బాగుంటుంది అన్న మాట వినవస్తోంది. అలాగే ఇప్పటికైనా తెలుగు నేర్చుకుని అచ్చమైన తెలంగాణా ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ వంటి వారు ఉంటే బాగుంటుంది అని అంటున్నారు.