Begin typing your search above and press return to search.

ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా... తెరపైకి మోడీ, షా, యోగీ ఫ్యామిలీస్ టాపిక్!

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి

By:  Tupaki Desk   |   23 April 2024 6:08 PM GMT
ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా... తెరపైకి మోడీ, షా, యోగీ ఫ్యామిలీస్ టాపిక్!
X

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో... రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న మోడీ.. ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుండగా.. వాటికి కౌంటర్ గా అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!

అవును... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ.. ఈ క్రమంలో రాజస్థాన్‌ లో ప్రచారం నిర్వహించారు! ఈ సమయంలో... దేశ ప్రధాని మోడీ.. ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. మోడీ హిందువులకు ప్రధానా.. లేక, దేశ ప్రజలందరికీ ప్రధానా అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. బ్రిటిషర్లు వదిలేసిన డివైడ్ అండ్ రూల్ ని ఇంకా మెయింటైన్ చేయడం భావ్యం కాదని అంటున్నారు! ఈ సమయంలో... మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పందించారు.

ఇందులో భాగంగా... కేవలం ముస్లింలు మాత్రమే పిల్లలను ఎక్కువగా కంటున్నారా..? అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్. ఇదే సమయంలో... మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయికి 7 మంది సోదరులు సోదరీమణులు ఉన్నారని.. యోగీ తల్లిదండ్రులకు కూడా ఏడుగురు సంతానం ఉండగా.. అమిత్ షాకు కూడా ఏడుగురు సోదర సోదరీమణులున్నారని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. అదేవిధంగా మోడీ తల్లి కూడా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు!

ఇదే సమయంలో... దేశానికి చారిత్రక కట్టడాలుగా చెప్పుకుంటున్న ఎర్రకోట, తాజ్‌ మహల్, కుతుబ్ మినార్, జామా మసీదు, చార్మినార్‌ నిర్మాణాలను ముస్లింలే నిర్మించారని చెప్పిన అక్బరుద్దీన్... దేశాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దిందే ముస్లింలు అని తెలిపారు. ఇదే సమయంలో... ముస్లింలను చొరబాటుదారులని చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ దేశం తమదే అని ఇకపై కూడా భారత్ తమ దేశంగానే ఉంటుందని నొక్కి చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వైరల్ గా మారాయి. జాతీయ మీడియాలో బ్యానర్ ఇష్యూగా మారాయి.