రాహుల్ కి పోటీగా ప్రధాని పోస్టుకు అఖిలేష్ రెడీ...?
దాంతో ఈసారి కనీసంగా నలభై దాకా సీట్లు గెలుచుకున్నా అఖిలేష్ యాదవ్ ప్రధాని పదవికి స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2023 1:17 PM GMTఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు అయింది. ఈ కూటమి గెలిస్తే ప్రధాని ఎవరు అవుతారు అన్నది ఈ రోజుకు అప్రస్తుతం. ఆ విధంగా కూటమి నేతలు ఐక్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరువ అవుతారు. కానీ ఇండియా కూటమిలో అందరూ పెద్దన్నలే అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ప్రధాని పోటీలో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత శశిధరూర్ ఇప్పటికే ప్రకటించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ అయినా లేక మల్లికార్జున ఖర్గే కానీ తమ పార్టీ నుంచి ప్రధాని అవుతారు అని శశిధరూర్ మనసులో మాటను పార్టీ మాటనూ చెప్పేశారు. ఇక ఆ తరువాత ఇండియా కూటమిలో మెల్లగా ఒక్కొక్కరూ గొంతు సవరించుకుంటున్నారు. యూపీ మాజీ సీఎం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ప్రధాని రేసులో ఉన్నారని ఆయన అభిమానులు అంటున్నారు.
అఖిలేష్ యాదవ్ కాబోయే ప్రధానమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ జోరు చేస్తున్నారు. అఖిలేష్ యూపీకి సీఎం గా పాలించారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అది. ఏకంగా 80కి పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. దాంతో ఈసారి కనీసంగా నలభై దాకా సీట్లు గెలుచుకున్నా అఖిలేష్ యాదవ్ ప్రధాని పదవికి స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారు అని అంటున్నారు.
యూపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. మళ్ళీ 2027లో కానీ ఉండవు, దాంతో నేరుగా పీఎం పోస్టుకే టార్గెట్ పెడితే పోలా అని అఖిలేష్ యాదవ్ కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. యూపీ దేశ రాజకీయాల్లో ఎపుడూ కీలకమైన భూమిక పోషిస్తూ వస్తోంది. ఈ రోజున దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా యూపీలోని వారణాసి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అలాంటిది యూపీ నుంచి తాను కొత్తగా ప్రధాని పదవి రేసులోకి రావాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. అలాగే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అనుకుంటున్నారు. మరి అఖిలేష్ ఆశలను ఏ విధంగా చూడాలని అంటున్నారు. అయితే ఇదంతా అఖిలేష్ యాదవ్ మీద కార్యకర్తలకు ఉన్న అభిమానం అని ఎస్పీ నేత హసన్ చాంద్ అంటున్నారు. అఖిలేష్ ఈ దేశ ప్రధానిగా సేవలందించాలని కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నట్టు చెప్పారు.
దీని మీద యూపీని దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఘాటుగానే రియాక్ట్ అయింది. అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని కావాలంటూ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేయడంపై బీజేపీ నేత యూపీ మంత్రి డేనేష్ అజాద్ అన్సార్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ దేశంలో కలలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఎవరైనా కలలు కనవచ్చని, అయితే, తమ సామర్థ్యాన్ని బట్టి కలలు కనాలని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని, దేశ ప్రజలు మోదీని బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు.
మోదీని మూడోసారి కూడా ప్రధానిగా ప్రజలు ఎన్నుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరి దీని మీద కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో చూడాలి. అంతే కాదు, ప్రధాని రేసులో ఉన్న బెంగాల్ దీదీ మమతా బెనర్జీ, అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి వారు ఎలా దీన్ని చూస్తారో మరి. మొత్తానికి ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ లింగం అని వెనకటికి ఒక సామెత ఉంది. ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు రావాలి, అది బిగ్ టాస్క్. కానీ దాని కంటే ముందు ప్రధాని అభ్యర్ధుల మధ్య పోటీ పెరిగిపోతోంది.