మాల్దీవుల ప్రెసిడెంట్ మెడపై కత్తి... రంగంలోకి అమితాబ్!
ఈ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం కూడా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 9 Jan 2024 9:30 AM GMTభారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశాన్ని వణికించేస్తున్నాయి. భారత్ కు మద్దతుగా దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది. ఇప్పటికే ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్ ను నిలిపేస్తున్నామని నిషాంత్ పిట్టీ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం కూడా తెరపైకి వచ్చింది.
భారత్ తో పాటు ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అక్కడ మరింత చిచ్చు రేపుతున్నాయి. ఇందులో భాగంగా... ప్రెసిడెంట్ మహ్మద్ మయిజ్జుపై పార్లమెంటరీ విపక్ష నేత అలీ అజీం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు.
మరోపక్క భారత్ పైనా, భారత ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మాల్దీవుల ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మాల్దీవుల విదేశాంగశాఖ ప్రతినిధి అలీ నాజర్ మహమ్మద్ తో భారత హైకమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కానే కావని వివరించినట్లు చెబుతున్నారు.
భారత్ 911 కాల్ వంటిది!:
భారత్ పై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై వారిదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా... భారత్ తమకు ఎంతో ముఖ్యమని, అది ఆపత్కాలంలో ఆదుకునే "911 కాల్" వంటిదని.. ప్రస్తుత ప్రభుత్వంలో దూరదృష్టి లోపించడంవల్లే ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు వినవలసి వస్తుందని.. భారత్ ఎల్లప్పుడూ తమకు ఎంతో సాయం చేస్తుందని మాల్దీవుల రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్ దీదీ స్పందించారు.
కాగా... అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం కాల్ చేసేదే "911" నెంబర్!
బిగ్ బి అమితాబ్ ఎంట్రీ!:
మాల్దీవ్స్ వద్దు లక్షద్వీప్ ముద్దు అనే వ్యవహారం ట్రెండింగ్ అవుతున్న వేళ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఎంటరయ్యారు. ఇందులో భాగంగా.. లక్షద్వీప్ లో పర్యాటకానికి తన ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. లక్షద్వీప్, అండమాన్ లాంటి మన ప్రాంతాలే అత్యుత్తమం అని కొనియాడారు. ఈ క్రమంలో.... "మనం భారతీయులం. మనం స్వయం సమృద్ధి సాధించాం. మా ఈ స్వీయ అభివృద్ధిని పరీక్షించొద్దు. జైహింద్" అని ఎక్స్ లో పోస్టు చేశారు.