Begin typing your search above and press return to search.

అమెరికాలో అక్ష‌ర‌ధామ్‌.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతికి కార‌ణాలు ఇవే!

అక్ష‌ర‌ధామ్‌.. ఈ పేరు విన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు ఢిల్లీ. హిందూ ఆల‌యాల్లో విశిష్ట‌త‌కు ఈ అక్ష‌ర ధామ్‌లు ఎంతో ప్రసిద్ధి

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:00 AM GMT
అమెరికాలో అక్ష‌ర‌ధామ్‌.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతికి కార‌ణాలు ఇవే!
X

అక్ష‌ర‌ధామ్‌.. ఈ పేరు విన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు ఢిల్లీ. హిందూ ఆల‌యాల్లో విశిష్ట‌త‌కు ఈ అక్ష‌ర ధామ్‌లు ఎంతో ప్రసిద్ధి. ఒక్క ఢిల్లీలోన కాకుండా.. దేశంలో గుజ‌రాత్‌లోనూ అక్ష‌ర ధామ్ ఉంది. అయితే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న అక్ష‌ర‌ధామ్‌.. విదేశీప‌ర్యాట‌కులు భారీ సంఖ్య‌లో వ‌స్తుంటారు. దీంతో ఇది బాగా ఫేమ‌స్ అయింది. ఇక‌, ఇప్పుడు అమెరికాలోనూ అక్ష‌ర‌ధామ్ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో ఒక‌టిగా నిలుస్తోంది.

ఏంటీ అక్ష‌ర‌ధామ్‌..

అక్షరధామ్ ఆల‌యాలు.. హిందూ సంప్రదాయానికి చిహ్నం. 1781-1830కి చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణ్ పేరుతో ఈ ఆల‌యాల‌ను నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ ఆల‌యాల్లో క‌ళ్ల‌ను క‌ట్టేసే శిల్ప సంప‌ద ప్ర‌త్యేకం. అందుకే ఎక్క‌డెక్క‌డ నుంచో ప‌ర్యాట‌కులు ఈ అక్ష‌ర‌ధామ్‌ల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటారు. ఈ క్ర‌మంలో అమెరికాలోనూ అక్ష‌ర‌ధామ్ రూపు దిద్దుకుంది. ఉత్త‌ర అమెరికాలోని స్వామినారాయ‌ణ్ సంస్థ‌లు.. ఈ దేవాల‌యాన్ని తీర్చ‌దిద్దాయి. ఈ ఏడాది అక్టోబ‌రులో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను అనుమ‌తించారు.

ఎక్క‌డుంది?

అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే నగరంలో ప్ర‌ఖ్యాత అక్ష‌ర ధామ్‌ను తీర్చిదిద్దారు. దేశానికి వెలుప‌ల నిర్మించిన‌ అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. స్వామి నారాయ‌ణ్ సంస్థ‌ల‌కు.. ప్రపంచవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ దేవాలయాలున్నాయి. 3,850 ఇత‌ర ఆద్యాత్మిక‌ కేంద్రాలను కూడా ఈ సంస్థ నిర్విరామంగా నిర్వ‌హిస్తుండ‌డం విశేషం. ఈ అక్ష‌ర ధామ్‌ల‌ను చూసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్యాట‌కులు భారీ ఎత్తున త‌ర‌లి వస్తుండ‌డం కూడా గ‌మ‌నార్హం.

ఎన్నెన్నో ప్ర‌త్యేక‌త‌లు

అమెరికాలో రూపుదిద్దుకున్న అక్ష‌ర ధామ్‌లో ఎన్నెన్నో ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. ప‌ర్యాట‌కును, భ‌క్తుల‌ను క‌ట్టిప‌డేసే శిల్ప సంప‌ద‌తో పాటు ఆధ్యాత్మిక భావాల‌ను మ‌న‌సుకు హ‌త్తుకునేలా చేస్తాయి.

+ అమెరికాలో నిర్మించిన అక్ష‌ర ధామ్‌లో తొలి గ‌డ‌ప దాటి లోప‌ల‌కు వెళ్ల‌గానే.. 11 అడుగుల ఎత్తైన స్వామినారాయణుని విగ్ర‌హం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.

+ అమెరికా అక్ష‌ర‌ధామ్ నిర్మాణం.. 2011లో ప్రారంభమైంది. ఏకంగా 12,500 మంది కార్మికులు ఈ నిర్మాణ ప‌నుల్లో పాలు పంచుకున్నారు. అదేవిధంగా 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.

+ ఆల‌యంలో వినియోగించిన ప్ర‌ధాన పాల‌రాయిని ఇటలీ నుండి తీసుకురాగా.. బల్గేరియా నుండి సున్నపురాయిని వినియోగించారు.

+ భారతదేశం నుండి గ్రానైట్, రాజస్థాన్ నుండి ఇసుకరాయి, మయన్మార్ నుండి టేకు కలప, గ్రీస్, టర్కీ, ఇటలీ నుండి కలపతో సహా ప్రపంచవ్యాప్తంగా 29 కంటే ఎక్కువ ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణానికి సంబదించిన మార్బుల్, సున్నపురాయిని వినియోగించారు.

+ ఈ ఆలయంలో 10,000 శిల్పాలు ఉన్నాయి.ఈ శిల్పాలు భారతీయ వాస్తుశిల్పం, సంస్కృతి చిహ్నాలుగా నిలుస్తాయి.