Begin typing your search above and press return to search.

అయోధ్యలో కోతుల ఆహారానికి స్టార్ హీరో కోటి విరాళం

అయోధ్య గురించి చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కోటి విరాళం ప్ర‌క‌టించ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   29 Oct 2024 2:16 PM GMT
అయోధ్యలో కోతుల ఆహారానికి స్టార్ హీరో కోటి విరాళం
X

అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక చారిత్ర‌క ఘ‌ట‌న‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో జ‌వ‌జీవాలు నింపిన అరుదైన ప్ర‌య‌త్న‌మిది. స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడుకునేందుకు, ప‌విత్ర దేవాల‌యాల‌ను ర‌క్షించుకునేందుకు ఇది అద‌న‌పు బ‌లాన్నిచ్చింది.

అయోధ్య గురించి చ‌ర్చ జ‌రుగుతున్న వేళ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కోటి విరాళం ప్ర‌క‌టించ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌విత్ర స్థ‌లం అయోధ్య‌లో మ‌నుగ‌డ సాగిస్తున్న కోతుల‌కు ఆహారం అందించేందుకు ఈ సాయాన్ని అత‌డు ప్ర‌క‌టించాడు. జగద్గురు స్వామి రాఘవాచార్య జీ మహారాజ్ మార్గదర్శకత్వంలోని ఆంజనేయ సేవా ట్రస్ట్.. అయోధ్యలో మ‌నుగ‌డ‌ కోసం పోరాడుతున్న కోతులకు ఆహారం అందించే గొప్ప మిషన్‌ను చేపట్టింది. అక్క‌డ ఎవ‌రైనా వ‌దిలి వెళ్లే ఆహారంపై ఆధారపడి కోతులు జీవించాల్సి వ‌స్తోంది. పవిత్ర పట్టణంలో ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ కోతులకు ఆహారం అందని ప‌రిస్థితి ఉంది. దీంతో కోతుల‌కు తిండి అందించడానికి ట్రస్ట్ చొరవ తీసుకుంది. ఉదార స్వభావంతో దానధ‌ర్మాల‌కు ముందుకు వ‌చ్చే గొప్ప మ‌న‌సున్న క‌థానాయ‌కుడిగా అక్ష‌య్ కుమార్ కి పేరుంది. అత‌డిని ఆంజ‌నేయ‌ ట్రస్ట్ సంప్రదించింది.

అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా దీనికి అంగీకరించడమే కాకుండా, భారీ మొత్తంలో విరాళం కూడా ఇచ్చాడని చెబుతున్నారు. ఈ పవిత్ర జీవులకు రోజువారీ ఆహారం అందించడానికి 1 కోటి విరాళాన్ని అక్ష‌య్ అందించాడు. కోతులు అత్యంత పవిత్రమైన జీవులు... హిందువులు హనుమంతుడిగా భావించి పూజిస్తారు. కానీ పవిత్ర పట్టణంలో వాటి మ‌నుగ‌డ‌ చాలా కష్టంగా ఉంది. కోతుల జీవ‌న‌ పరిస్థితి మెరుగుపడేందుకు అక్షయ్ కుమార్ తన సహాయాన్ని అందిస్తున్నారు.

ఇదే విషయంపై ఆంజనేయ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ ప్రియా గుప్తా మాట్లాడుతూ-``అక్షయ్ కుమార్ చాలా దయగల, ఉదారమైన వ్యక్తి అని నాకు తెలుసు.. త‌న సిబ్బంది లేదా త‌న‌తో కలిసి పనిచేసే సహ నటులు ఎవ‌రికైనా క‌ష్టం వ‌చ్చిందంటే ఆదుకుంటాడు. అతడు త‌క్ష‌ణమే ఉదారంగా విరాళం ఇవ్వడంలో అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచాడు.

అక్ష‌య్ ఈ గొప్ప సేవను తన తల్లిదండ్రులు హరి ఓం అరుణా భాటియా.. అతని బావ రాజేష్ ఖన్నా పేరిట అంకితమిచ్చాడు. అక్షయ్ కేవలం ఉదారత ఉన్న‌ దాత మాత్రమే కాదు.. దేశ‌భ‌క్తి, సామాజిక స్పృహ ఉన్న పౌరుడు కూడా. అతడు ఒక పౌరుడిగా అయోధ్య నగరంలోని కోతుల స్థితి గురించి ఆందోళన చెందాడు. కోతులకు ఆహారం ఇచ్చేటప్పుడు ఏ పౌరుడు అసౌకర్యానికి గురికాకుండా చూడాల‌ని కూడా అన్నారు. కోతులకు ఆహారం ఇచ్చే ప్ర‌క్రియ‌లో అయోధ్య వీధుల్లో చెత్త వేయకుండా చూస్తామని అక్ష‌య్ తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అక్షయ్ కుమార్ ప్రస్తుతం కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ `హౌస్‌ఫుల్ 5` షూట్‌ను పూర్తి చేస్తున్నాడు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రం 6 జూన్ 2025న విడుదల కానుంది.