ఆలపాటి 'త్యాగం' ఫలించేనా ..!
తొలుత కొన్ని రోజులు అలిగినా.. తర్వాత.. పెద్దాయన చంద్రబాబు జోక్యంతో సర్దుకున్నారు.
By: Tupaki Desk | 21 Feb 2025 10:30 AM GMTఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రికూడా అయిన ఆలపాటి రాజేంద్రప్రసాద్.. గత ఎన్నికలకు ముందు తెనాలి నుంచి పోటీ చేయాలని భావించారు. దీనికి సంబంధిం చి అన్నీ సమాయత్తం చేసుకున్నారు. నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. అయితే.. అనూహ్యంగా కూటమి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు తెనాలి కేటాయించారు. దీంతో ఆలపాటి త్యాగం చేయకతప్పలేదు. తొలుత కొన్ని రోజులు అలిగినా.. తర్వాత.. పెద్దాయన చంద్రబాబు జోక్యంతో సర్దుకున్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టభద్రుడిగా ఆయన పోటీ చేస్తున్నారు. వచ్చే 27వ తారీకున ఎన్నికల పోలింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు కూడా ఈ రెండు జిల్లాల్లోనూ తిరుగుతున్నారు. కానీ... ఆయన త్యాగం ఫలించేనా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. కీలకమైన ఇద్దరు నాయకులు.. రాజాకు ఏమాత్రం సహకరించడంలేదని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట.
తెనాలి నుంచి విజయందక్కించుకున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌లు ఇద్దరూ బలమైన నాయకులు. పైగా.. నాదెండ్ల మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బలంగా ప్రచారం చేస్తే.. ఆలపాటి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. కానీ, ఆ ఆదిశగా ఇద్దరూ ప్రయత్నాలు చేయడం లేదు. దీనిలో ఎవరి కారణాలు వారికి ఉన్నాయని తెలుస్తోంది. ఆలపాటి గెలిచి.. మండలికి వెళ్తే.. నియోజకవర్గంపై ఆయన పెత్తనం పెరుగుతుందన్న భావన నాదెండ్లలో కనిపిస్తోంది.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాదెండ్ల తెనాలిలో చక్రం తిప్పుతున్నారు. దీంతో రేపు ఆలపాటి విజయం దక్కించుకుంటే.. తన ప్రభావం తగ్గుతుందని నాదెండ్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఇక, గతంలో ఉన్న వివాదాల కారణంగా ధూళిపాళ్ల మౌనంగా ఉంటున్నారు. వ్యాపార విషయంలో ఆలపాటికి.. నరేంద్ర కుమార్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇవి రాజకీయాలతోనూ ముడిపడ్డాయి. దీంతో ఆలపాటి పోటీ చేస్తున్నా.. నరేంద్ర కుమార్ పన్నెత్తు ప్రచారం కూడా చేయడం లేదు. దీంతో ఆలపాటి చేసిన త్యాగం ఏమేరకు ఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. చిత్రం ఏంటంటే.. ఇక్కడ వైసీపీ వామపక్షాలకు మద్దతు ఇచ్చింది.!