ఆలపాటి-లక్ష్మణరావు.. గెలుపు గుర్రం ఎవరు ..!
ఆఖరుకు ప్రశాతంగా ముగిశాయి. ఎత్తులు.. పై ఎత్తులు.. సాధారణ ఎన్నికల్లో ఉన్నట్టుగానే.. ఈ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించాయి.
By: Tupaki Desk | 28 Feb 2025 7:13 AM GMTపైకి ప్రశాంతమైన ప్రచారం.. కానీ అంతర్గతంగా నాయకుల మధ్య ఉత్కంఠ! కూటమి పార్టీల్లోనూ ఏ నాయకుడు ఎవరికి సహకరిస్తున్నాడన్న చర్చ!! గ్రాడ్యుయేట్ ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తాడోనన్న ఆసక్తి! వెరసి.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. చివరి దశలో ఉత్కంఠకు గురి చేశాయి. ఆఖరుకు ప్రశాతంగా ముగిశాయి. ఎత్తులు.. పై ఎత్తులు.. సాధారణ ఎన్నికల్లో ఉన్నట్టుగానే.. ఈ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించాయి.
దీనిలో ఎవరూ తక్కువ కాదన్నట్టుగానే ఎన్నికల ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా.. ఉమ్మడి రెండు జిల్లాల్లో 3.47 లక్షల మంది ఓటర్లు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నుకున్నారు. సాయంత్రం 4గంటల తర్వాత కూడా.. లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే.. గతానికి భిన్నంగా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గిందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక, బరిలో 25 మంది ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యే సాగింది.
కూటమి బలపరచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ తరఫున మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుల మధ్యే హోరా హోరీగా సాగింది. ఇద్దరూ కూడా ఉద్ధండులే కావడం గమనార్హం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆలపాటి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు కూటమి నేతల సహకారం ఉంది. ఇక, కేఎస్ లక్ష్మణరావు.. మూడుసార్లు ఎమ్మెల్సీగా గతంలో విజయం దక్కించుకున్నా రు. ఈయనకు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో మంచి పేరుంది.
పైగా.. వైసీపీ మద్దతు ప్రకటించింది. దీంతో ఆలపాటి-లక్ష్మణరావుల మధ్య ఈ ఎన్నిక అత్యంత ఉత్కంఠ గా మారింది. తుది ఎన్నికల పోలింగ్ అంచనాను బట్టి 66 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపా రు. ఇది కూడా.. ఉమ్మడి కృష్నాలోనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. దీనిని బట్టి.. ఆలపాటికి మొగ్గు ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. కేఎస్ లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు ప్రకటించనంత వరకు బాగానే ఉందని.. వైసీపీ ఎంట్రీతో కొంత డ్యామేజీ జరిగిందన్న చర్చ నడుస్తోంది. అయినప్పటికీ ఉద్యోగ వర్గాలు.. కేఎస్‌కు అనుకూలంగానే ఉన్నట్టు తెలిసింది. హోరా హోరీగా సాగిన ఈ పోరులో .. ఎవరు విజయం దక్కించుకున్నా స్వల్ప ఆధిక్యంతోనే బయట పడే అవకాశం ఉంది.