నిరుటి కంటే తక్కువే.. ఐనా దక్షిణాదిలో తాగేవారు తెలంగాణలోనే ఎక్కువ
అయినప్పటికీ ప్రభుత్వాల మద్యం ఆదాయం ఏటేటా పెరుగుతూ పోయిందే కానీ తగ్గలేదు.
By: Tupaki Desk | 16 Feb 2025 12:30 AM GMTరెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలైతే మద్య నిషేధం అమలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చి అమలుకు ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వాల మద్యం ఆదాయం ఏటేటా పెరుగుతూ పోయిందే కానీ తగ్గలేదు. గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత మద్యం అమ్మకాలు బాగా పెరిగాయని ఓ ఆరోపణ ఉంది. పొరుగున ఉన్న ఏపీలో కొంతకాలం కిందట నెలకొన్న పరిస్థితులు తెలంగాణలో మద్యం విక్రయాలకు మంచి అవకాశంగా మారాయి.
మరోవైపు తెలంగాణ సంస్కృతిలో మద్యం తాగడం ఒక భాగంగా పరిగణిస్తారు. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాల్లో ఇది సర్వసాధారణం. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడం.. ఆర్థిక వనరులు పెరగడంతో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయనేది అంచనా. అందుకని మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డులను తిరగరాస్తోంది. దక్షిణ భారతదేశంలోనే మద్యం విక్రయాల్లో టాప్ లో ఉందట.
రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చేసిన ప్రకటన మేరకు.. తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం తాగున్నారట. అయితే, వీరి సంఖ్య గతం కంటే కాస్త తగ్గిందని పేర్కొంది. రాజ్య సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. దేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం తాగుతున్నట్లు తెలిపారు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం తాగుతున్నారని పేర్కొన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 ప్రకారం.. ఏపీలో 34.9 శాతం, తెలంగాణలో 53.8 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు.
2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2శాతం, తెలంగాణలో 50 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారట.
2024 జూన్ నాటికి తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, 1,200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.36 వేల కోట్ల ఆధాయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్లు విస్తృతంగా ఉన్నందునే మద్యం వినియోగం పెరుగుతోందని కేంద్రం తెలిపింది.