Begin typing your search above and press return to search.

మహాత్ముడికి ఘోర అవమానం.. విజ్ఞత మరిచిన వ్యక్తుల వీరంగం?

చాలా మందికి నేడు దేశంలో స్వేచ్ఛగా బ్రతికేస్తుంటే.. ఈ స్వేచ్ఛకు కారణమైన స్వాతంత్ర సమరయోధుల విలువ తెలియడం లేదు!

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:58 AM GMT
మహాత్ముడికి ఘోర అవమానం.. విజ్ఞత మరిచిన  వ్యక్తుల వీరంగం?
X

చాలా మందికి నేడు దేశంలో స్వేచ్ఛగా బ్రతికేస్తుంటే.. ఈ స్వేచ్ఛకు కారణమైన స్వాతంత్ర సమరయోధుల విలువ తెలియడం లేదు! బానిస సంకెళ్లు తెంచిన యోధుల పోరాట పఠిమకు ఇవ్వాల్సిన కనీసం గౌరవం ఇవ్వడం లేదు! ఎవరికి వారు సొంత విశ్లేషణలు చేసుకుంటూ..స్వాతంత్ర వీరులకు అవమానాలు కలిగిస్తున్నారు!

ఇంట్లో తాత, ముత్తాత, వారి తాతల ఫోటోలకు దండలు వేస్తూ, ఫోటోలకు పూజలు చేస్తుంటారు చాలా మంది. అది మంచిదే! కానీ... దేశానికే పెద్దలు అయిన వారిపట్ల మాత్రం ఇంగితం మరిచి, విజ్ఞత విడిచి నడుచుకుంటుంటారు! అంబేద్కర్ ను కులానికి, వివేకానందుడిని మతానికి పరిమితం చేస్తుంటారు .

మహాత్మ గాంధీపై జోకులు పేలుస్తుంటారు.. సర్ధార్ వల్లబాయ్ పటేల్ గురించి తలచుకునే ఆలోచన చేయకుంటారు.. సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని, చంద్రశేఖర్ ఆజాద్ త్యాగాన్ని మరిచిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహాత్ముడి విగ్రహంపై తాగుబోతులు వీరంగం సృష్టించారని తెలుస్తోంది.

అవును... ఇటీవల జరిగిన గాంధీ జయంతి నాడు హైదరాబాద్ లోని ప్రగతినగర్ అంబేరుచెరువు దగ్గర మహాత్ముడి విగ్రహన్ని నెలకొల్పారు కొంతమంది నాయకులు. అయితే... ఈ విగ్రహం నెలకొల్పిన ప్రాంతం చాలా కాలంగా మందుబాబుల అడ్డా అని చెబుతున్నారు. దీంతో... చీకటి పడిందంటే చాలు మందుబాబులు ఇక్కడకు చేరి హల్ చల్ చేస్తున్నారని అంటున్నారు.

కేవలం పబ్లిసిటీ కోసం అన్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద మందుబాబులను నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారని స్థాన్నికులు వాపోతున్నారని అంటున్నారు. దీనిపై స్థానిక నేతలు, పోలీసులు కాస్త దృష్టిసారించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు! ప్రధానంగా ఆ విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.