Begin typing your search above and press return to search.

చరిత్ర చూస్తే.. ప్రభుత్వాలను కూల్చేసేంది.. మార్చేసేంది.. 'మద్యం'

‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఇది సాధారణ ప్రజలకు చెప్పే హెచ్చరిక. కానీ ‘మద్యం’ జోలికి వెళ్లారో కుర్చీలు కూలిపోతాయ్ జాగ్రత్త

By:  Tupaki Desk   |   23 March 2024 4:30 PM GMT
చరిత్ర చూస్తే.. ప్రభుత్వాలను కూల్చేసేంది.. మార్చేసేంది.. మద్యం
X

‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఇది సాధారణ ప్రజలకు చెప్పే హెచ్చరిక. కానీ ‘మద్యం’ జోలికి వెళ్లారో కుర్చీలు కూలిపోతాయ్ జాగ్రత్త.. ఇది ప్రభుత్వాలకు హెచ్చరిక. ఎందుకంటే.. చరిత్రలో మద్యంతో పెట్టుకున్న సర్కారు లేవీ మంచి పేరు తెచ్చుకోలేదు. దీనికి తాజా ఉదాహరణ.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే.

బిహార్ నుంచి తెలుగు రాష్ట్రాల దాకా

సంపూర్ణ మద్య నిషేధం అనేది ఓ మూడు దశాబ్దాల కిందట ఉమ్మడి ఏపీని కుదిపేసిన వ్యవహారం. దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 1994 ఎన్నికల సందర్భంగా ఇదే హామీతో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో సారా వ్యతిరేక ఉద్యమం పెద్దఎత్తున సాగింది. చివరకు అది మద్య నిషేధం వరకు దారితీసింది. ఇక 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తన హామీని నిలుపుకొన్నారు. కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని సడలించారు. చివరకు ఆయన పాలనలోనే నిషేధాన్ని ఎత్తివేశారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కాగా, 2004లో వైఎస్ ప్రభుత్వం మద్య నియంత్రణ హామీ ఇచ్చి ఆచరణలో విఫలమైంది. ఇక కొన్నేళ్ల కిందట బిహార్ లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం కూడా మద్య నిషేధం విధించింది. అయితే, ఆ రాష్ట్రంలో కల్తీ సారా మరణాలు తరచూ సంభవిస్తున్నాయి. దీనిపై నీతీశ్ ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. కాగా, 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలో వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో మద్యాన్ని ఐదేళ్లలో ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీని వణికించింది..

తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు మద్యమే కారణం. వరుసగా రెండుసార్లు ఢిల్లీ సీఎం అయి.. పంజాబ్ వంటి రాష్ట్రంలోనూ అధికారం చేజిక్కించుకుని, గుజరాత్ కు సైతం విస్తరించిన ఆప్.. జాతీయ పార్టీగా హోదా పొందింది. అలాందిటి ఇప్పుడు ఆప్ పరిస్థితి ఏమిటనేది చూడాలి. కాగా, మద్యం విధానంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెతో కలిసి కేజ్రీ సాగించిన లావాదేవీలే ఆయన పతనానికి కారణమయ్యాయి. ఇటు తెలంగాణలో కవిత కూడా మద్యం కేసులో ఇరుక్కుని విమర్శల పాలయ్యారు. ఓ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది చెడ్డపేరు తెచ్చింది. ఓ మహిళ అయి ఉండి.. మద్యం వ్యవహారాల్లో తలదూర్చడం బీఆర్ఎస్ కు చేటు చేసిందనే చెప్పాలి. కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఏపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి పేర్లు కూడా వినిపించాయి. వీరంతా అప్రూవర్లుగా మారడంతో కేసు కేజ్రీవాల్, కవిత మీద ఫోకస్ అయిన సంగతి తెలిసిందే.