సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ పంచాయితీ!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. ముఖ్యంగా నాన్-వెజ్ పచ్చళ్లకు వీరు చాలా ఫేమస్.
By: Tupaki Desk | 4 April 2025 10:50 AMప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. ముఖ్యంగా నాన్-వెజ్ పచ్చళ్లకు వీరు చాలా ఫేమస్. రాజమండ్రి కేంద్రంగా చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎంతో కష్టపడి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వీరి పచ్చళ్లకు ఆర్డర్లు వస్తుండటం విశేషం.
వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వెల్లువెత్తేవి. వీరి పచ్చళ్ల రుచి అంతగా ఉండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ధరలు కూడా భారీగా పెంచారని వినియోగదారులు అంటున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండటంతో వారికున్న ఫాలోయింగ్ పచ్చళ్ల వ్యాపారానికి మరింత ఊపునిచ్చింది.
ప్రస్తుతం ఖ్యాతి గాంచిన "అలేఖ్య చిట్టి పికిల్స్" వ్యాపారం వివాదాల కారణంగా మూతపడే దుస్థితికి చేరుకుంది. రాజమండ్రి కేంద్రంగా వెజ్, నాన్-వెజ్ పచ్చళ్లను తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్న ఈ వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వివాదాస్పద వీడియోల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
అలేఖ్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఈ వ్యాపారాన్ని ఎంతో శ్రద్ధతో అభివృద్ధి చేశారు. తమ ఉత్పత్తులను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో మంచి గుర్తింపు పొందారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, పచ్చళ్ల వివరాలు, ధరలను వినియోగదారులకు తెలియజేసేవారు.
అయితే ఇటీవల ఒక కస్టమర్ నాన్-వెజ్ పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని (అరకిలో రూ. 1200) వాట్సాప్‌లో అభిప్రాయం వ్యక్తం చేయగా.. అలేఖ్య పికిల్స్ నుండి దుర్భాషలతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ వాయిస్ మెసేజ్‌లో ఒక మహిళ వినియోగదారుడిని ఘాటుగా దూషించడమే కాకుండా అసభ్య పదజాలం కూడా ఉపయోగించింది.
ఈ వివాదం కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. వారు తమ ఫోన్ నెంబర్లను స్విచ్ఛాఫ్ చేయడమే కాకుండా వాట్సాప్ ఖాతాను, వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు. కొత్త ఆర్డర్లను కూడా స్వీకరించడం లేదు.
ఇదిలా ఉండగా తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కూడా అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు ధరల విషయంలో అసభ్యంగా మాట్లాడినట్లు ఉంది. ఒక వినియోగదారుడు ఊరగాయల ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ఆమె అతడిని తీవ్రంగా దూషించింది. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఉత్పత్తులను ఎవరూ కొనవద్దంటూ పిలుపునిస్తున్నారు.
ఈ వివాదంపై ఇద్దరు సిస్టర్స్ స్పందించారు. అయితే వారి వివరణలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. రమ్య అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ వీడియోను విడుదల చేసింది. గతంలో తమకు మద్దతు తెలిపిన నెటిజన్లు ఇప్పుడు తప్పు చేసినందుకు శిక్షిస్తున్నారని ఆమె పేర్కొంది.
మొత్తానికి సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం కారణంగా ఒక విజయవంతమైన వ్యాపారం మూతపడే పరిస్థితికి రావడం గమనార్హం. వినియోగదారులతో వ్యవహరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన తెలియజేస్తోంది.