ఆ దేశ ప్రధానిని కరిచిన మరో దేశ అధ్యక్షురాలి పెంపుడు కుక్క
ఒక దేశ ప్రధానమంత్రి వేరే దేశానికి అతిధిగా వెళ్లినప్పుడు ఎంత ప్రోటోకాల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు
By: Tupaki Desk | 18 Nov 2023 4:05 AM GMTఒక దేశ ప్రధానమంత్రి వేరే దేశానికి అతిధిగా వెళ్లినప్పుడు ఎంత ప్రోటోకాల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. భద్రత విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉంటారు. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే మాత్రం విస్మయానికి గురి కాక మానదు. ఎందుకంటే.. తన విదేశీ పర్యటన సందర్భంగా తాను వెళ్లిన దేశ అధ్యక్షురాలి పెంపుడు కుక్కకాటుకు గురయ్యారు మరోదేశ ప్రధాని. ఈ విచిత్రమైన ఉదంతం ఎలా జరిగింది? ఆ తర్వాతేమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రియా దేశ ప్రధానమంత్రి తాజాగా మాల్డోవా దేశానికి వెళ్లారు. యూరోప్ లో భాగమైన ఈ చిట్టి దేశానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు మైయా సందు. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ మాల్డోవా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన అధినేతలు అధ్యక్ష భవనానికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటుండగా.. మాల్డోవా దేశాధ్యక్షురాలి పెంపుడు కుక్క అక్కడకు వచ్చింది.
పెంపుడు కుక్కలంటే ఇష్టపడే ఆస్ట్రియా ప్రధానమంత్రి దాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా.. అది కాస్తా ఆయన చేతిని కరిచింది. దీంతో.. ఆయన అవాక్కు అయ్యారు. జరిగిన ఘటన మీద మాల్డోవా దేశాధ్యక్షురాలు క్షమాపణలు చెప్పారు. వారు సమావేశమైన వేళలో.. అక్కడ సమీపాన భద్రతా సిబ్బందితో పాటు ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా తన పెంపుడు కుక్క భయపడి ఉంటుందని.. అందుకే కరిచి ఉంటుందని పేర్కొన్నారు.
వీరి భేటీ అనంతరం చేతి కట్టుతో మాల్డోవా పార్లమెంటుకు వచ్చిన ఆస్ట్రియా ప్రధాని ప్రసంగించారు. అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అయ్యారు. తనకు పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టడని.. ఆ విషయం అందరికి తెలుసన్న ఆయన.. ''ఉత్సాహంతో దాన్ని దగ్గరకు తీసుకున్నప్పుడు అలా చేసింది. నా పర్యటన ఎంతో అద్భుతంగా జరిగింది'' అంటూ పోస్టు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనను కరిచిన పెంపుడు శునకం ఆడుకోవటానికి ఒక బొమ్మను బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు ఆస్ట్రియా ప్రధాని. మొత్తంగా ఒక దేశ ప్రధానిని.. మరో దేశాధ్యక్షురాలి పెంపుడు కుక్క కరవటం మాత్రం పెద్ద వార్తగా మారింది.