పవన్ దీక్షా దక్షతలను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ?
పవన్ కి దీక్షలు చేసే స్వేచ్చ లేదా అంటే లేకేమి ఆయన బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న సమాధానమూ వస్తుంది.
By: Tupaki Desk | 26 Sep 2024 7:29 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయం గురించి తెలియని వారు లేరు. ఆయన గత పదేళ్ళుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వస్తున్నారు. ఆయన దూకుడుతో కూడిన రాజకీయం చేస్తారు. అగ్గెస్సివ్ మోడ్ లో మాట్లాడుతారు. ఆయన ప్రసంగాలు ఆవేశపూరితంగా ఉంటాయి.
ఇవన్నీ అందరికీ తెలిసిందే. అత్యధికులు వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పవన్ మార్క్ పాలిటిక్స్ ఆ విధంగానే హైలెట్ అవుతూ వచ్చింది. అయితే పవన్ పదేళ్ళ పాటు సుదీర్ఘమైన పోరాటం చేసిన తరువాత అధికారం అందుకున్నారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. అధికారంలో ఉంటూ దాదాపుగా నాలుగు నెలల పాలన పూర్తి చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన దూకుడు రాజకీయం ఇపుడు మాత్రమే ప్రశ్నించబడుతోంది. అలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇక్కడ చర్చ. ఉదాహరణకు తీసుకుంటే తిరుపతి లడ్డూ అపవిత్రం అయింది అని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అది ఇపుడు విమర్శల పాలు అవుతోంది. పవన్ కి దీక్షలు చేసే స్వేచ్చ లేదా అంటే లేకేమి ఆయన బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న సమాధానమూ వస్తుంది.
అయితే పవన్ ఇపుడు ఉన్న పరిస్థితి ఆయన ఉన్న పొజిషన్ చూసిన వారు మాత్రం దానిని తప్పు పడుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముందు ఏదైనా సమస్య వస్తే ఆయన దానిని అధికారిక స్థాయిలో పరిష్కరించగలిగే స్థితిలో ఉన్నారు. అధికార మంత్ర దండం ఆయన చేతిలో ఉంది.
చట్టం ఆయన దగ్గర ఉంది. మరి ఇన్ని ఉంచుకుని ఆయన సామాన్యుల మాదిరిగా ఇంకా చెప్పాలీ అంటే విపక్ష పాత్రలోకి వెళ్ళి ఎందుకు ఆందోళన బాటలు పడుతున్నారు అన్నదే ప్రశ్న. ప్రాయశ్చిత్త దీక్ష సాధారణంగా ఎవరు చేసుకుంటారు అంటే తప్పు చేసిన వారు. మరి పవన్ ఏ తప్పు చేశారని ఈ దీక్ష అంటే జవాబు లేదు.
ఆయన అధికారంలో ఉండగా తప్పు జరిగితే శాఖాపరమైన విచారణ జరిపించి దానికి సరైన పరిష్కారం కనుగొనాలి. అదే రాజధర్మం. అదే ప్రజలు కూడా ఆశించేది. ఇక ఆయన అధికారంలో లేని టైం లో గత ప్రభుత్వం లో తప్పులు జరిగాయి అంటే ఆ విషయంలోనూ ఒక సమగ్రమైన విచారణ జరిపించాలి. బాధ్యులను వెతికి పట్టుకోవాలి. ఒక వేళ ప్రాయశ్చిత్తం అంటూ చేస్తే ఆ తప్పులు చేసిన వారే చేయాలి.
మరి పవన్ ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నారు అన్నదే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. పైగా ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారు అంటే సర్వ మతాలు సమానం అని చాటి చెప్పే పొజిషన్ లో ఉన్నారు అని చెప్పాలి. ఆయన ముందు ఏ మతం సమస్య అయినా ఏ వర్గం సమస్య అయినా వచ్చినా దానికి ఒకే విధంగా రాజ్యాంగంలో సూచించిన మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అలా కాకుండా ఆయన ప్రాయశ్చిత్తం దీక్షలు అంటూ చేయడం అంటే అది ఒక విధంగా పలాయనవాదం కాదా అన్న చర్చ కూడా లేవనెత్తుతున్నారు. అన్నింటికీ మించి పవన్ తాను అధికారంలో ఉన్నాను అన్న దాన్ని విస్మరిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.
అందుకే పవన్ దీక్షా దక్షత్లా మీద ఇపుడు ప్రశ్నలు సందేహాలు వ్యక్తం చేసేవారు బాగా అధికం అవుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అధికారంలో ఉన్న వారు ఆరోపణలు చేయకూడదు, అనుమానాలు అంతకంటే వ్యక్తం చేయకూడదు, వారు ఫుల్ పవర్స్ కలిగి ఉన్నారు కాబట్టి అలా వచ్చిన వాటిని పూర్తి స్థాయిలో వారు పరిష్కరించగలిగి ఉండాలి.
కానీ అలా జరగకపోవడం వల్లనే ఇపుడు ఈ రకమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో చూస్తే లడ్డూ ప్రసాదాల విషయంలో కల్తీ జరిగింది అన్నది ఒక ఆరోపణ. దానిని చేసిన వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు. దాని మీద బిగ్గరగా మాట్లాడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి సహా కీలక నేతలు.
అయితే అధికారంలో ఉన్న వారు ఆరోపణల నిగ్గు తేల్చాలి కానీ విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం చేయడమేంటి అన్నదే ఇపుడు హాట్ డిబేట్ గా ఉంది. ఏది ఏమైనా పవన్ వ్యక్తిగత స్థాయిలో దీక్షలు చేసుకోవచ్చు కానీ ఆయన డిప్యూటీ సీఎం గా కూడా రాజ్యాంగం ప్రసాదించిన తన హక్కులను బాధ్యతలను పూర్తి స్థాయిలో డిశ్చార్జి చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు.