Begin typing your search above and press return to search.

ఆళ్ళ నాని ఇన్...వాళ్ళు అవుట్ ?

ఆయన ఎవరో కాదు కీలక నేతగా ఉన్న ఏలూరు మాజీ మునిసిపల్ చైర్మన్ ఈశ్వరీ బలరాం టీడీపీకి దూరం అవుతారని వైసీపీలోకి చేరుతారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 11:30 PM GMT
ఆళ్ళ నాని ఇన్...వాళ్ళు అవుట్ ?
X

రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఎప్పుడూ కాదు. అవి సున్నా కూడా ఒక్కోసారి కావచ్చు. అధికారం అనే సిమెంట్ వారినీ వీరిని కలిపినట్లు కనిపించినా తెలియని శత్రుత్వం అడ్డుగోడలా నిలిచి కృత్రిమ బంధాలను బీటలు వారుస్తుంది. అందుకే నేతలు ఎంత మంది పోయినా అధినేత బేఫికర్ గా ఉంటారు.

ఎందుకంటే వారికి ఈ ఈక్వేషన్స్ బాగా తెలుసు. రాజకీయ త్రాసులో బరువు ఎపుడూ ఒకే వైపు ఉంటే అది మొగ్గు కాదు ఇబ్బంది అవుతుంది. రాజకీయం ఎపుడూ శిబిరాలుగా విడిపోయే సాగుతుంది. పార్టీలు వాటికి పైకి కనిపించే ఆకారాలుగా ఉంటాయి.

ఇక దశాబ్దాలుగా ఒకే చోట ఉంటూ పాలిటిక్స్ చేసే క్రమంలో అయిన వారు కాని వారు అన్నీ ఉంటాయి. దాంతోనే పార్టీలలో జంపింగులు అత్యధికం సాగుతాయి. ఇవన్నీ ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రిగా వైసీపీలో పనిచేసిన ఆళ్ళ నాని వైసీపీకి దూరం అయ్యారు. ఆయన ఇపుడు టీడీపీలోకి అడుగుపెడుతున్నారు.

ఆయన చేరిక అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కానీ ఆయన సైకిలెక్కడం మాత్రం ఖాయం. ఇదే ఇపుడు ఏలూరు పాలిటిక్స్ లో పెద్ద చర్చకు అంతకంటే పెద్ద రచ్చకు దారి తీస్తోంది. ఆళ్ల వర్సెస్ టీడీపీగా ఒకపుడు రాజకీయం సాగేది. దాంతో ఆయన రాకను టీడీపీలో లోకల్ గా ఉండేవారు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఇటు వైపు వస్తే మేము అటు వైపు అంటున్న వారూ ఉన్నారు

అలా చూస్తే కనుక ఆళ్ళ టీడీపీలో ఇన్ అయ్తే అవుట్ అయ్యే నేతల జాబితా కూడా సిద్ధంగా ఉంది అని అంటున్నారు ఈ లిస్టులో మొదట వినిపించే పేరు ఇపుడు ప్రచారంలో ఉంది. ఆయన ఎవరో కాదు కీలక నేతగా ఉన్న ఏలూరు మాజీ మునిసిపల్ చైర్మన్ ఈశ్వరీ బలరాం టీడీపీకి దూరం అవుతారని వైసీపీలోకి చేరుతారు అని అంటున్నారు.

ఇక వైసీపీలో అధికారంలో ఉన్నపుడు బలరాం, ఈశ్వరి దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఎడా చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. రెండవసారి కంటిన్యూ చేయకుండా ఆళ్ళ నాని అడ్డుకున్నారన్న కారణంతో వారు వైసీపీకి గుడ్ బై కొట్టి టీడీపీలో చేరారు. వారిని చంద్రబాబు సమక్షంలో చేర్చుకున్నారు.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారు కష్టపడి పనిచేసే టీడీపీని గెలిపించారు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని చాలా మంది చెబుతున్నారు. ఇందులో తొలి బోణి మాత్రం ఈశ్వరీ బలరాం దంపతులదే అంటున్నారు.

ఈ బలరాం దివంగత నేత కోటగిరి విద్యాధరరావు శిష్యుడు. ఆయన కుమారుడు కోటగిరి శ్రీధర్ ఏలూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ఏలూరు మాజీ ఎంపీగా ఉన్నారు. దాంతో కోటగిరి శ్రీధర్ కే వైసీపీ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం మేరకే ఈశ్వరీ బలరాం దంపతులు వెళ్తున్నారు అని అంటున్నారు.

అంగబలం అర్ధబలం తో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న ఈ దంపతుల చేరికతో టీడీపీకి కొంత నష్టమే అని అంటున్నారు. ఏది ఏమైనా ఆళ్ల నాని చేరితే మాత్రం ఏలూరు నియోజకవర్గం టీడీపీ రాజకీయంలో చాలా రచ్చ జరిగే చాన్స్ ఉందని అంటున్నారు.