అళ్ళ నానికి దక్కిన హామీ అదేనా ...అసంతృప్తి చల్లారదట ?
అలా అసెంబ్లీ సీటు అయితే తన కుమారుడిని పోటీ చేయించడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 1:30 AM GMTకాంగ్రెస్ వైసీపీలలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు ఆళ్ళ నాని. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కూడా ఆయనే. పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆయన రాజకీయంగా కీలకమైన పదవులే అందుకున్నారు వైఎస్సార్ కి సన్నిహితునిగా కాంగ్రెస్ పార్టీలో రాణించిన ఆళ్ళ నాని వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీగా అవకాశం అందుకున్నారు. ఇక 2019లో వైసీపీ గెలిచాక ఆయనకు జగన్ మంత్రివర్గంలో తొలి మూడేళ్ళ పాటు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ దక్కింది.
ఇదిలా ఉంటే వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించారో లేక మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఆళ్ళ నాని వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చారు. ఆయన టీడీపీలో చేరిపోయారు ఇదంతా చాలా సింపుల్ గా జరిగిపోయింది. అయితే అళ్ళ నాని టీడీపీలోకి రావడం వెనక ఉద్దేశ్యాలు ఏమిటి ఆయనకు దక్కిన భరోసా లేక హామీ ఏమిటి అన్న చర్చ అయితే ఏలూరు జిల్లాలో విస్తృతంగా సాగుతోంది.
ఆళ్ళ నానికి టీడీపీ అధినాయకత్వం నుంచి మంచి అవకాశాన్ని కల్పిస్తామన్న ఒక్క భరోసాతోనే ఆళ్ళ నాని పసుపు కండువా కప్పుకున్నారు అని అంటున్నారు. అయితే 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన అన్నది ఉంటుందని చెబుతున్నారు. అది కనుక జరిగితే ఏలూరు అసెంబ్లీ సీటు రెండుగా మారుతుందని అందులో ఒకటి ఆళ్ళ నాని కోరారని అంటున్నారు.
అలా అసెంబ్లీ సీటు అయితే తన కుమారుడిని పోటీ చేయించడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. అలా కాకుండా అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన లేకపోతే మాత్రం 2029 నాటికి ఏలూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనలు సంగతి ఎలా ఉన్న మంచి అవకాశమే ఇస్తామని హామీ దక్కిందని చెబుతున్నారు.
దాంతో రెండవ మాట లేకుండా ఆళ్ళ నాని తన అనుచరులతో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే తన కుమారుడి రాజకీయ వారసుడిగా నిలబెట్టడానికే ఆళ్ళ నాని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారని అంటున్నారు. గోదావరి జిల్లాలలో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీని ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు వైసీపీ అధినాయకత్వం మీద ఉన్న అసంతృప్తి వంటివి ఆళ్ళ నానిని టీడీపీ వైపు అడుగులు వేసేలా చేశాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఆళ్ళ నానిని పార్టీలో చేర్చుకున్నా ఏ రకమైన కచ్చితమైన హామీ ఇవ్వకుండా టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తపడింది అని అంటున్నారు. దానికి కారణం ఆళ్ళ నాని రాకను టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాక్రిష్ణయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూండడమే అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆళ్ళ నాని చేరిక మీద ఎమ్మెల్యే బడేటి రాధాక్రిష్ణయ్య సచలన వ్యాఖ్యలు చేశారు. అధినాయకత్వం ఆదేశాలను కాదనలేకనే తాను ఆళ్ళ చేరికను కాదనలేకపోయాను అని అన్నారు. ఆళ్ళ విషయంలో కొంతమంది అసంతృప్తి ఎప్పటికీ అలాగే ఉంటుందని అది చల్లబడేది కాదని ఆయన స్పష్టం చేసారు.
అధికారం ఎటు వైపు ఉంటే అటువైపుగా కొందరు పార్టీలు మారుతూంటారని అటువంటి వారికి ఎలాంటి విలువ ఉండదని బడేటి రాధాక్రిష్ణయ్య ఆళ్ళ మీద పరోక్ష విమర్శలు చేసారు. అసంతృప్తి ఎప్పటికీ ఆరేది కాదని చెబుతూ బడేటి ఈ వ్యాఖ్యలు చేయడంతో అళ్ళ నాని చేరిక టీడీపీ తమ్ముళ్ళకు ఏ మాత్రం ఇష్టం లేదనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.