జనసేనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరికపై ఆసక్తికర చర్చ!
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఆయన జనసేనలో చేరే అవకాశాలపై చర్చ మొదలైంది!
By: Tupaki Desk | 9 Dec 2024 7:22 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ పలువురు వైసీపీ నేతలు గోడ దూకుతున్న సంగతి తెలిసిందే. చిన్న హోదా, పెద్ద హోదా అనే తారతమ్యాలేమీ లేకుండా ఎవరి స్థాయిలో వారు సైకిల్ ఎక్కడమో, గాజు చేత పట్టడమో చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఆయన జనసేనలో చేరే అవకాశాలపై చర్చ మొదలైంది!
అవును... వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బంధువు, సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన నుంచి రెడ్డి సామాజికవర్గం కేటగిరీలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.
ఈ సమయంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2014, 2019 లో వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాదిలో, సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న ఆయన.. జగన్ కు బై బై చెప్పడం అప్పట్లో వైరల్ గా మారింది. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు!
అయితే... 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి మాత్రం ఆయన తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయని.. ఈ మేరకు ఆయనకు అనుచరుల నుంచి ఒత్తిడి కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరహాలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జనసేనలో చేరే అవకాశాలపై చర్చ నడుస్తోంది. అందుకు అవకాశాలు కూడా ఉన్నాయని, సమస్యలూ ఉన్నాయని అంటున్నారు!
వాస్తవానికి మంగళగిరిలో 2014లో కేవలం 12 ఓట్ల మెజారిటీతోనే గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై 5వేల పైచిలుకు ఓట్లతో గెలిచి సంచలనం సృష్టించారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆర్కేకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదు! అలా అని ఆయన ఇప్పుడు జనసేనలో చేరినా టిక్కెట్ దక్కే అవకాశాలు తక్కువని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తే టీడీపీ నుంచి లోకేష్ ను కాదని మంగళగిరి నుంచి జనసేన పోటీ చేసే అవకాశం లేదు. ఈ లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవకాశాలు లేకుండాపోయే అవకాశమూ లేదు! పైగా జనసేనపై ఆర్కే పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలూ లేవు! ఒక వేళ ఉన్నా.. రాజకీయాల్లో శాస్వత శత్రుత్వం ఉండదనే నానుడి ఉండనే ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో... 'జనసేనలో మంగళగిరి ఆర్కే' అనే అంశంపై చర్చ నడుస్తోంది. మరోవైపు... ఆళ్ల రామకృష్ణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారంటూ కథనాలొస్తున్నాయి. మరి.. ఆళ్ల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి!