రాజకీయాలకు 'ఆళ్ల' గుడ్ బై?
అయితే.. దీనిపై అధికారికంగా ఆళ్ల ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల సారాంశం ప్రకారం.. ఆళ్ల రామకృష్నారెడ్డి.. ఎన్నికల తర్వాత వైసీపీతో టచ్‌లో లేరని తెలుస్తోంది.
By: Tupaki Desk | 3 Sep 2024 12:30 PM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు మంగళగిరి నాయకులు. ఆయన ఏ పార్టీలోనూ ఇమడలేరని.. ఇక, రాజకీయంగా ఆయన దూరం కావాల ని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. దీనిపై అధికారికంగా ఆళ్ల ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల సారాంశం ప్రకారం.. ఆళ్ల రామకృష్నారెడ్డి.. ఎన్నికల తర్వాత వైసీపీతో టచ్‌లో లేరని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి కూడా మూడు మాసాలైనా ఆయన ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. పైగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మరోవైపు వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమీక్షల్లోనూ ఆళ్ల జాడ ఎక్కడా కనిపించలేదు. కేవలం చంద్రబాబుపై ఉన్న ఓటు కు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో మాత్రమే ఆళ్ల కనిపించారు. అంతకు మించి ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలకు ముందు తనకు టికెట్ ఇవ్వడం లేదని భావించిన ఆళ్ల వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో షర్మిల వెంటే నడుస్తానన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత.. తిరిగి వైసీపీ గూటికి వచ్చారు.
అయినా కూడా.. ఆళ్లకు టికెట్ దక్కలేదు. అయితే.. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిని చేస్తా మని జగన్ హామీ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఆళ్ల సర్దుకు పోయారు. అప్పట్లో వైసీపీ తరఫున బరిలో నిలిచిన మురుగుడు లావణ్యకు ఆయన ప్రచారం చేశారు. రెడ్డి సామాజిక వర్గంఓట్లన్నీ .. లావణ్యకే పడేలా చేస్తానని కూడా చెప్పారు. కానీ, ఆయన వ్యూహం ఫలించలేదు. లావణ్య దారుణ పరాభవంతో ఓటమి పాలయ్యారు. ఇక, ఆ తర్వాత నుంచి ఆళ్ల ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు రెడీ అయ్యారని.. ఆయన వైసీపీకి, రాజకీయాలకు కూడా.. త్వరలోనే దూరం కానున్నారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి దీనిలో ఎంత మేరకు నిజం ఉందంటే.. గతంలో ఆళ్ల వ్యవహార శైలిని గమనించిన వారు.. ఔననే అంటున్నారు. ఏ క్షణం ఎలా ఉంటారో తెలియని నాయకుడని.. కాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల రాజకీయాలకు దూరమైనా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.