Begin typing your search above and press return to search.

ఆళ్లగడ్డలో టీడీపీ మహిళా నేత హత్య.. భర్తకు తీవ్ర గాయాలు

ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది విపక్ష వైసీపీ.

By:  Tupaki Desk   |   26 Jun 2024 4:15 AM GMT
ఆళ్లగడ్డలో టీడీపీ మహిళా నేత హత్య.. భర్తకు తీవ్ర గాయాలు
X

ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది విపక్ష వైసీపీ. దీనిపై తరచూ ప్రెస్ మీట్లు పెడుతూ.. ఆ పార్టీ నేతలు అక్కడ అలా జరిగింది. ఇక్కడ ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నేత కుటుంబంపై దాడికి దిగారు వారి రాజకీయ ప్రత్యర్థులు. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీ మహిళా నేత ఒకరు దారుణ హత్యకు గురి కావటం సంచలనంగా మారింది. ఈ దాడి ఘటనలో సదరు మహిళ భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతం ఆళ్ల గడ్డలో హైటెన్షన్ కు కారణమైంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అత్యంత సన్నిహితురాలైన తెలుగుదేశంమహిళా నేత శ్రీదేవి హత్యకు గురయ్యారు.

మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ హత్య కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటారు ఏవీ భాస్కర్ రెడ్డి.. ఆయన సతీమణి శ్రీదేవి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ తరపున ఈ దంపతులు యాక్టివ్ గా ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఈ దంపతులపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీదేవి మరణించగా.. తీవ్ర గాయాలైన ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ హత్యోదంతంతో ఆళ్లగడ్డ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎమ్మెల్యే సన్నిహితురాలిని హత్య చేయటం షాకింగ్ గా మారింది. హత్య చేసిందెవరు? అన్నది బయటకు రావాల్సి ఉంది. దాడి గురించి సమాచారం అందుకున్నంతనే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు అఖిలప్రియ. అప్పటికే శ్రీదేవిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీదేవి భౌతికకాయాన్ని చూసిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దాడికి సంబంధించిన వివరాల్ని పోలీసుల్ని అడిగి తెలుసుకున్నారు. హత్య చేసిన నిందితుల్ని వదిలిపెట్టొద్దని.. కఠినంగా శిక్షించాలని కోరారు. హత్య వెనకున్న అసలు కారణాలు బయటకు రావాల్సి ఉంది.