ఉక్రెయిన్ విమానాశ్రయాలన్నీ బంద్.. మోదీ 7 గంటల టూర్.. 20 గంటల ప్రయాణం
అయితే, ప్రతి దేశానికి ప్రత్యేక విమానంలో వెళ్లే మోదీ.. ఈసారి 20 గంటల పాటు ప్రయాణించి కీవ్ ను చేరాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 22 Aug 2024 12:33 PM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో ఉక్రెయిన్ చేరనున్నారు. మామూలుగా అయితే, ప్రధాని ఉక్రెయిన్ లో దిగుతారు అని చెప్పాలి.. కానీ, ఇప్పుడు చేరుతారు అనే అనాలి. ఎందుకంటే మోదీ వెళ్తున్నది ప్రత్యేక రైలులో. ఇప్పటికే మోదీ పోలండ్ లో ఉన్నారు. అక్కడినుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు వెళ్లాలి. అయితే, ప్రతి దేశానికి ప్రత్యేక విమానంలో వెళ్లే మోదీ.. ఈసారి 20 గంటల పాటు ప్రయాణించి కీవ్ ను చేరాల్సి వస్తోంది.
చరిత్రాత్మక పర్యటనే
మోదీ ఇప్పటివరకు 70కి పైగా దేశాలను సందర్శించారు. పొరుగున్న బంగ్లాదేశ్ సహా అమెరికాకు పలుసార్లు వెళ్లారు. మరో నెలలో అమెరికాకూ వెళ్లనున్నారు. అయితే, వాటన్నిటి కంటే ముఖ్యం ఉక్రెయిన్ పర్యటనే అని చెప్పాలి. ఎందుకంటే.. రెండున్నరేళ్లుగా రష్యాతో చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ పూర్తిగా నలిగిపోయింది. ఆర్థికంగా, సైనికంగా, వసతుల పరంగా కోలుకోలేనంత నష్టపోయింది. ఓ 50 లక్షల కోట్లు ఉంటేనే గానీ.. ఉక్రెయినీ మళ్లీ పాత ఉక్రెయిన్ లా కనిపించదు. అలాంటి యుద్ధ బాధిత దేశానికి మోదీ వెళ్తుండడం బహుశా చరిత్రలో ఏ భారత ప్రధాని కూడా చ యని పర్యటనే.
విమానాల్లేవ్..
రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ ఏ మాత్రం తగ్గకుండా రష్యా మీద పోరాడుతోంది. ఇటీవల రష్యాలోకి ఉక్రెయిన్ దళాలు ప్రవేశించాయి. కస్క్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ప్రతిగా తాము ఆక్రమించిన డాన్ బాస్క్ లో రష్యా విరుచుకుపడుతోంది. దీంతోనే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కీలక ములపు తిరగనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రష్యా నుంచి వైమానిక దాడుల ముప్పు ఉండడంతో ఉక్రెయిన్ లోని అన్ని విమానాశ్రయాలనూ మూసివేశారు. దీంతో విమాన రాకపోకలు లేవు.
పర్యటన 7 గంటలు.. ప్రయాణ 20 గంటలు
మోదీ ఉక్రెయిన్ చరిత్రాత్మక పర్యటనలో ఆ దేశంలో గడిపేది ఏడు గంటలు మాత్రమే. కానీ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకోవడానికి 20 గంటల ప్రయాణం చేస్తున్నారు. అంటే పర్యటనకు మూడు రెట్లు సమయం ప్రయాణం అన్నమాట. కాగా, మోదీ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటనకు ఉద్దేశించిన ప్రత్యేక రైలులోని వసతులపై ఇప్పటికే అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే రైలు యూరప్ దేశాలకు చెందిన పలువురు అధినేతలు కీవ్ వరకు వెళ్లారు. వారి సరసన ఇప్పుడు మోడీ కూడా చేరనున్నారు. అక్కడ ఏం మాట్లాడతారో? చూడాలి