వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది.
By: Tupaki Desk | 9 Aug 2024 9:11 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్య రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కోవలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాను వైసీపీ అధ్యక్షుడు జగన్ కు పంపారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి పదవితోపాటు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆళ్ల నాని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చేతిలో ఓడిపోయారు.
వైఎస్ జగన్ మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాతో ఆయనకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. కోవిడ్ సమయంలో ఆళ్ల నాని బాగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అయినా జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నానికి పదవి పోయింది. ఆళ్ల నాని స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.
మరోవైపు తనకు మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆళ్ల నాని కూడా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. జనసేనాని పవన్ కల్యాణ్ పైన, ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆయన గతంలో విమర్శలు చేసేవారు. అయితే అది కూడా మిగతా వైసీపీ నేతల్లా కాకుండా మంచి భాషనే ఉపయోగించేవారు.
అయితే మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి ఆళ్ల నాని అసలు వార్తల్లో కనిపించడం మానేశారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగా నిర్వహించిన ఎమ్మెల్యేల్లో ఆళ్ల నాని కూడా ఉన్నారని.. ఈ కార్యక్రమంలో తొలి నాళ్లలోనే సీఎం జగన్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.
ఇటీవల ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి నాని ఆసక్తి చూపారని టాక్ నడిచింది. అయితే వైఎస్ జగన్ ఆయనను ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయించారు.
ఏలూరులో 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన ఆళ్ల నాని 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లోనూ విజయం సాధించారు. 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. 2019లో మళ్లీ విజయ బావుటా ఎగురవేశారు. మొత్తం మీద మూడుసార్లు ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తాజాగా వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్టు వెల్లడించారు.