ఈ సారి ఆర్కే మంత్రి అవుతారా...!?
అలాగే జగన్ కలను ఆర్కే కూడా నెరవేర్చారు. మంగళగిరిలో 2019లో నారా లోకేష్ ని ఓడించి ఆర్కే జగన్ కళ్ళలో ఆనందం చూశారు.
By: Tupaki Desk | 20 Feb 2024 9:05 AM GMTవైసీపీలో ఆర్కే అనబడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి పుణ్యమాని అలాగే మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించిన నేపధ్యం వల్ల కానీ ఫ్యామస్ అయిపోయారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. అంతే కాదు జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున సత్తెనపల్లిలో పోటీకి టికెట్ సాధించాలనుకున్నారు కానీ చివరి నిముషంలో మిస్ అయింది. ఆయన కోరికను జగన్ రెండు సార్లు నెరవేర్చారు.
అలాగే జగన్ కలను ఆర్కే కూడా నెరవేర్చారు. మంగళగిరిలో 2019లో నారా లోకేష్ ని ఓడించి ఆర్కే జగన్ కళ్ళలో ఆనందం చూశారు. కానీ జగన్ అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీ ఒకటి నిలబెట్టుకోలేదు అన్న బాధ అయితే ఆర్కే ఉంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని ఆయన చాలా బాధపడ్డారు. తొలి విడతలో కాకపోతే మలి విడతలో అయినా పదవి దక్కుతుంది అని అనుకున్నా అది జరగలేదు.
అలా బాధ కాస్తా అసంతృప్తిగా మారింది. అది చివరికి ఆర్కేకు మంగళగిరిలో 2024లో టికెట్ దక్కదు అన్న మాట రావడంతో పెల్లుబికింది. అంతే ఆయన గత డిసెంబర్ లో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అంతే కాదు ఆయన షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆమె పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్యేగా సంచలనం రేపారు.
ఇది జరిగి సరిగ్గా నెల అయింది. ఇపుడు ఆయన మళ్లీ సొంత పార్టీలో చేరిపోయారు. మంగళగిరిలో తనకంటూ సొంత బలం బలగం ఉన్న ఆర్కే లేని లోటు వైసీపీకి తెలిసివచ్చింది. అలాగే రెండవసారి కూడా లోకేష్ ని మంగళగిరిలో ఓడిస్తే ఇక ఆయన రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడుతుంది అని వైసీపీ ఊహిస్తోంది.
దాంతో వైసీపీకి కూడా ఆర్కే అవసరం పడింది. ఆర్కే సైతం కాంగ్రెస్ లోకి వెళ్ళి చేసేది లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓట్ల చీలిక తప్ప గెలిచేది లేది. దాంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వంటి వారి సంప్రదింపులతో ఆయన మెత్తబడ్డారు. ఇపుడు జగన్ సమక్షంలో ఆయన తిరిగి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. ఇదిలా ఉంటే ఆర్కే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.మరోవైపు, మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.
అదే విధంగా ఆర్కేకు భారీ హామీ కూడా లభించింది అని అంటున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కోటాలో అయినా ఆర్కేకు మంత్రి పదవి ఖాయం అని అంటున్నారు. ఏది ఏమైనా ఆర్కే వైసీపీ మధ్య గ్యాప్ అతి కొద్ది రోజులలోనే ముగిసిపోవడం ఏపీ రాజకీయాల్లో ఒక కీలక చర్చగా మారింది.