Begin typing your search above and press return to search.

ఆ సర్వే మీదనే అందరి ఆరా !?

కానీ ఆ ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వేనే ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:35 PM GMT
ఆ సర్వే మీదనే అందరి ఆరా !?
X

దేశంలో అనేక సంస్థలు సర్వేలు ఇచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా సర్వేలు చేశాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లెక్కలేనన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చాయి. కానీ ఆ ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వేనే ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.

అదే ఆరా మస్తాన్ సర్వే. ఆయన సర్వే మీదనే అందరి చూపూ ఎందుకు అంటే ఆయన చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎపుడూ పొల్లు పోలేదు. తెలంగాణాలో కూడా గత ఏడాది ఆయన చేసిన సర్వేలు నిజం అయ్యాయి. అలా ఆరా మస్తాన్ చాలా ప్రాముఖ్యత సాధించారు.

దాంతో ఏపీలో చాలామంది ఎన్ని సర్వేల ఫలితాలు ఎక్కువ తక్కువలతో నంబర్లు ఇచ్చినా ఆరా మస్తాన్ చెప్పినది నిజమవుతుందా అన్నదే రాజకీయ వర్గాలలో చర్చకు కారణం అవుతోంది. ఆరా మస్తాన్ సర్వే అధికార వైసీపీకి ఆశాకిరణంగా ఉంది. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని నికరంగా చెప్పింది ఈ సర్వే. అంతే కాదు 94 నుంచి 104 సీట్లు ఇచ్చినా మరో పది కూడా పెరిగే చాన్స్ ఉందని చెప్పింది.

అలాగే ఎంపీ సీట్లు 13 నుంచి 15 దాకా ఇచ్చినా మరో ఒకటో రెండో పెరగవచ్చు అని సూచించింది. ఈసారి ఆరా మస్తాన్ తన సొంత ఊరిలో సర్వే ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఆయనను ప్రశ్నించారు. ఈ సర్వే ఫలితాలు తప్పు అయితే ఏమి చేస్తారు అంటే ఇక మీదట తెలుగు రాజకీయ తెర మీద సర్వేల పేరుతో ఆరా మస్తాన్ అన్న వ్యక్తి కనిపించడు అని సవాల్ చేస్తున్నట్లుగానే చెప్పారు.

తాను ఇచ్చిన సర్వే నివేదికలు నూటికి నూరు శాతం నిజం అవుతాయని ఆయన చెబుతున్నారు. ఒకవేళ తప్పితే తాను సన్యాసమే తీసుకుంటాను అని భీషణ ప్రతినే చేశారు. ఇదే ఇపుడు ఏపీలో అంతటా అందరినీ ఆలోచింపచేస్తోంది. మరి ఆరా మస్తాన్ అంత లోతుల్లోకి వెళ్ళి సర్వే చేశారా ఆయన జనం నాడి పట్టగలిగారా ఎవరికీ సాధ్యం కానీ విషయాలను ఆయన సాధించగలిగారా అన్నదే చర్చగా ఉంది.

నిజానికి ఏపీ పాలిటిక్స్ పెను గందరగోళంగా ఉంది. అంతా కూడా గోడ మీద పిల్లి మాదిరిగానే నివేదికలు ఇచ్చారు కొందరు ఎందుకైనా మంచిదని లోక్ సభకు ఒకలా లోకల్ కి మరోలా ఇచ్చేశారు. అయితే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అంతా సాంపిల్స్ తాము భారీగానే తీసుకుని చేశామని చెబుతున్నారు.

కానీ ఆరా మస్తాన్ మాత్రం తన కంటే సైంటిఫిక్ గా ఎవరూ చేయలేరని గతంలో నిరూపించుకున్నారు కాబట్టే ఆయన క్రెడిబిలిటీని బేస్ చేసుకుని ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తున్నారు. వైసీపీ అయితే ఆరా మస్తాన్ తక్కువ నంబర్ ఇచ్చారు కానీ తాము ఎక్కువే గెలుస్తామని అంటోంది. టీడీపీ అయితే తమకే ఎక్కువ సీట్లు వచ్చి అధికారంలోకి వస్తామని అంటోంది. మరి ఆరా మస్తాన్ సర్వే నిజం అవుతుందా అంటే జూన్ 4 వరకూ వెయిట్ చేయాల్సిందే.