బెయిల్ ముంగిట 'విద్రోహ' ఆరోపణ.. ఆ సీఎం ఇప్పట్లో బయటకు కష్టమే?
ఇదంతా చూస్తుంటే ఆయన రాజకీయ భవితవ్యం దాదాపు ముగిసినట్టేనా అనిపిస్తోంది.
By: Tupaki Desk | 7 May 2024 11:30 PM GMTఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ దాదాపు రెండు నెలలుగా జైలులో ఉన్నారు ఆ ముఖ్యమంత్రి. వీటిలోనే బెయిల్ దొరకడం కష్టంగా మారింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ వస్తుందనే ఆశ మిణుకు మిణుకు అంటుండగా, నెత్తిన పిడుగుపడింది. ఏకంగా ఇప్పుడున్న కేసుల కంటే బలమైన.. ఇంకా తీవ్రమైన ‘విద్రోహ’ కోణంలో విచారణ మొదలవనుంది. ఇదంతా చూస్తుంటే ఆయన రాజకీయ భవితవ్యం దాదాపు ముగిసినట్టేనా అనిపిస్తోంది.
పాత ఆరోపణలపై కొత్త విచారణ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపు.. రెండేళ్ల కిందట అత్యంత సంచలనం. కానీ, దీనిపై ఎన్నో ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఆప్.. ఖలిస్థానీ వేర్పాటువాదుల మద్దతుతోనే బలపడిందనే తీవ్రమైన విమర్శలు చేశారు కొందరు. ఇవన్నీ నిరూపణ కాలేదు. ఇంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ను వశం చేసుకుంది ఆప్.
ఏమిటీ ఆరోపణ?
ఖలిస్థాన్ అనుకూల నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్ జే) నుంచి రాజకీయ విరాళాలు పొందారనేది ఆప్ పై ఉన్న ఆరోపణ. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్ తీవ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్ విడుదల, ఖలిస్థాన్ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఎస్ఎఫ్ జే నుంచి ఆప్.. 16 మిలియన్ డాలర్లు (సుమారు రూ.135 కోట్లు) తీసుకున్నట్టు వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆషూ మోగియా గతంలో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగానే సక్సేనా కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. కాగా, 2014-22 మధ్య ఖలిస్థాన్ గ్రూపుల నుంచి ఆప్ నకు విరాళాలు అందాయని ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను విడుదల చేసిన వీడియోను కూడా తన లేఖలో సక్సేనా ప్రస్తావించారు. ప్రొఫెసర్ భుల్లర్ ను విడుదల చేయాలని ఆప్ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసిందని ఆ లేఖలో రాశారు.
ప్రొఫెసర్ కిల్లర్ భుల్లర్
జైలు నుంచి విడుదల కోరుతూ ఆప్ లేఖ రాసిన భుల్లర్ ఓ ప్రొఫెసర్. 1993లో తొమ్మిది మరణానికి కారణమైన ఢిల్లీ యూత్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బాంబు దాడికి ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1995 నుంచి తిహాడ్ జైలులో ఉన్నాడు. ట్రయల్ కోర్టు 2001లో మరణశిక్ష విధించగా, 2014లో సుప్రీం కోర్టు దాన్ని యావజ్జీవంగా తగ్గించింది. అయితే, భుల్లర్ విడుదల కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ న్యూయార్క్‌లోని గురుద్వారా రిచ్‌మాండ్ హిల్స్‌లో వేర్పాటువాదులను కలిసినట్టు, నిధులు తీసుకున్నట్టు ఫిర్యాదు రావడంతో ఎన్‌ఐఏ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేశారు. అక్కడ ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులతో కేజ్రీ భేటీ అయిన ఫొటోను ఆప్ మాజీ కార్యకర్త మునీష్ కుమార్ రైజాదా గతంలో ట్వీట్ చేశారు. దాన్ని కూడా సక్సేనా తన లేఖలో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షలతో పాటు, సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు.
ఎన్ఐఏ కేసు అంటే..?
ఇప్పటికే ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు కేజ్రీ. ఇప్పుడు ఖలిస్థానీల నుంచి విరాళాలు తీసుకున్న ఆరోపణపై ఎన్‌ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అత్యంత కఠినమైన ఎన్ఐఏ కేసు నమోదు చేస్తే గనుక అది పెద్ద సంచలనమే. ఒకవేళ అనారోగ్య కారణాలతో మద్యం కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చినా.. ఎన్ఐఏ కేసు ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది.